నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..

రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది.

Updated : 19 Apr 2024 08:13 IST

వడదెబ్బతో ఐదుగురు, పిడుగుపాటుతో ఒకరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. ఆరు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో కుతకుత ఉడికాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజిపూర్‌ మండలాల్లో 45.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత పదేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. అలాగే నల్గొండ, ఆదిలాబాద్‌ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్‌ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకడం ఇదే మొదటిసారి. దీంతోపాటు ఐదు జిల్లాల్లో 44.9 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదయ్యాయి. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామారావుపల్లిలో మట్కం గంగారాం(42), కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో పూదరి కనుకయ్య(70), కుమురం భీం జిల్లా కౌటాల మండలం జనగాంలో వేలాది మధుకర్‌(24), జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండల కేంద్రంలో కావలి వెంకటమ్మ(60), ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్‌ పంచాయతీ దస్నాపూర్‌గూడలో కరాడే విష్ణు(45) వడదెబ్బతో మృతిచెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన కావలి నీలకంఠం(32) పిడుగుపాటుతో మృతిచెందారు.

ఆరు జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాలులు

గురువారం ఆరు జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాలులు వీచాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, పాలకేడు, నూతన్‌కల్‌, మునగాల, నల్గొండ జిల్లా అనుముల హాలియా, నాంపల్లి, తిరుమలగిరి(సాగర్‌), భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌, కొత్తగూడెం, చండ్రుగొండ, వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్‌, దూగొండి, చెన్నారావుపేట, సిద్దిపేట జిల్లా ధూల్‌మిట్ట, సిద్దిపేట పట్టణం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చేర్యాల, రేగొండ మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన ప్రాంతాల్లో వృద్ధులు, చిన్నారులు, రోగులకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. సులువుగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

గురువారం గరిష్ఠ ఉష్ణోగత్రలు నమోదైన మండలాలు

మాడుగులపల్లి(నల్గొండ జిల్లా), హాజిపూర్‌(మంచిర్యాల)లలో 45.2, తాడ్వాయి, ములుగు, మంగపేట(ములుగు), గీసుకొండ(వరంగల్‌), చిన్నంబావి(వనపర్తి)లలో 45.1, వెల్గటూరు(జగిత్యాల), చెన్నూర్‌(మంచిర్యాల)లలో 45, మల్హర్‌రావు(భూపాలపల్లి), కురవి(మహబూబాబాద్‌), దస్తూరాబాద్‌(నిర్మల్‌), రామగిరి(పెద్దపల్లి), పెనుబల్లి(ఖమ్మం)లలో 44.9, చేర్యాల(సిద్దిపేట), చుంచుపల్లి(భద్రాద్రి), వీణవంక(కరీంనగర్‌), ఘన్‌పూర్‌(భూపాలపల్లి)లలో 44.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

రాష్ట్రానికి హెచ్చరికలు

  • అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణశాఖ రాష్ట్రానికి వడగాలుల ముప్పునకు సంబంధించి ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది.
  • ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని జిల్లాల్లో 41-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
  • 21న గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో..., 22న ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ‘పసుపు’ రంగు సూచనలు జారీ చేసింది.
  • 19, 20, 21 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని