ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం

మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి.

Published : 19 Apr 2024 04:05 IST

రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా ప్రత్యేక చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. అక్కడ గత మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 29 మంది మావోయిస్టులు చనిపోవడం, ఆ తర్వాత కూడా భద్రతా బలగాలు విస్తృత గాలింపులు కొనసాగిస్తుండటంతో.. మావోయిస్టులు ఇటువైపు రావచ్చన్న ఉద్దేశంతో తెలంగాణ సరిహద్దులను దాదాపు మూసివేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తుంటారు. దీన్ని అవకాశంగా తీసుకొని మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. ఇందుకు తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

అడవుల్లో విస్తృత గాలింపులతో..

2018లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కసన్‌సూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో 36 మంది మావోయిస్టులు చనిపోగా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌. మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో గత కొద్దిరోజులుగా భద్రతా బలగాలు విస్తృత గాలింపులు చేపడుతున్నాయి. కేంద్ర బలగాల సహకారంతో, ఆధునిక పరిజ్ఞానం సాయంతో దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్తున్నాయి. ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం.. వామపక్ష తీవ్రవాదంలో అనుసరించే వ్యూహం. అందుకే వారికి పట్టున్న ప్రాంతాల్లోకి వెళ్లినపుడు మావోయిస్టులు తమను తాము రక్షించుకునేందుకు కొత్త సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తారని, ఆ సమయంలో వారి ఆనుపానులు కనిపెట్టవచ్చన్నది భద్రతా బలగాల వ్యూహం. కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను తాము సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొంటున్న భద్రతా బలగాలు.. ఇదే ఊపుతో గాలింపులు చేపడుతూ వ్యూహాన్ని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రంలోకి చొరబడటం సులభమే!

ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరిగితే మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడే అవకాశం ఉంది. పైగా మావోయిస్టు ఉద్యమంలో ఇప్పటికీ తెలుగు నాయకులదే ఆధిపత్యం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలోకి రావడం కూడా సులభమే. అందుకే తాజా పరిణామాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న సరిహద్దుల్లో తెలంగాణ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రేహౌండ్స్‌కు చెందిన అదనపు బలగాలను రంగంలోకి దింపారు. నిరంతర కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రోడ్డు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గోదావరిని దాటడానికి అవకాశం ఉన్న అన్నిచోట్లా నిఘా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు మారుమూల అటవీ ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. ఒకవేళ భద్రతా బలగాల కళ్లుగప్పి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే.. వారి వల్ల నాయకులకు ముప్పు పొంచి ఉంటుంది. వామపక్ష తీవ్రవాదం పరంగా గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఒక్క సంఘటన జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న ఘటనకూ తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరస్పర సహకారం కోసం సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని