మళ్లీ వరికే పెద్దపీట

రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

Updated : 19 Apr 2024 05:44 IST

‘వానాకాలం’లో 65 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం
పత్తి 60 లక్షల ఎకరాల్లో..
వ్యవసాయశాఖ అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరి, 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని భావిస్తోంది. రానున్న వానాకాలం సీజన్‌ కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని గుర్తించింది. రాష్ట్రంలో ముందస్తు వాతావరణ పరిస్థితులు, గత ఏడాది వానాకాలం సీజన్‌ స్థితిగతులు, మార్కెట్లలో లభించిన ధరల అంచనాల ప్రాతిపదికన వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళికను రూపొందించింది.

ఆశాజనకంగా పత్తి సాగు    

రాష్ట్రంలో గత వానాకాలం సీజన్‌లో వరి 64 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77 లక్షల ఎకరాల్లో సాగైంది. యాసంగిలో మాత్రం వర్షాభావం, సాగునీరందక ఆశించిన మేర సాగు కాలేదు. ఈసారి మంచి వర్షాలే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ రెండు పంటలు గత ఏడాది వానాకాలం సీజన్‌కు మించి సాగయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తికి మంచి ధరలు రావడంతోపాటు కొనుగోళ్లు సజావుగా సాగడంతో రైతులు నిరుటి కంటే ఎక్కువగా సాగు చేస్తారని వ్యవసాయశాఖ భావిస్తోంది. గత వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న 5.27 లక్షల ఎకరాల్లో పండించారు. ఈ పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతోపాటు మద్దతు ధర కూడా లభించింది. దీంతో ఈసారి 10 లక్షల ఎకరాల మేరకు మొక్కజొన్న వేసే అవకాశం ఉంది. సోయాబీన్‌, కందులు అయిదేసి లక్షల ఎకరాల్లో, వేరుసెనగ, పెసలు, జొన్న లక్ష ఎకరాల చొప్పున, మినుములు, చిరుధాన్యాలు ఇతర పంటలు కలిపి మరో రెండు లక్షల ఎకరాల్లో పండిస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

విత్తనాలు, ఎరువుల సరఫరాకు సన్నాహాలు

పంటల సాగు అంచనాల మేరకు విత్తనాల పరంగా వరి 16.50 లక్షల క్వింటాళ్లు, మక్కలు 48 వేల క్వింటాళ్లు, పత్తి 121.16 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తోంది. ఇతర పంటల విత్తనాల లభ్యతకూ చర్యలు చేపట్టింది. దాదాపు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను జూన్‌ మొదటి వారం వరకే నిల్వ చేయనుంది. 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని