జపాన్‌లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు

జపాన్‌లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్‌ట్‌) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం గురువారం వెల్లడించింది.

Published : 19 Apr 2024 04:06 IST

నేటి నుంచి వచ్చే నెల 27 వరకు దరఖాస్తుకు అవకాశం
కాన్సులేట్‌ కార్యాలయం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: జపాన్‌లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్‌ట్‌) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం గురువారం వెల్లడించింది. జపాన్‌ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, సాంకేతిక కళాశాలల్లో మూడు, నాలుగు, అయిదు, సంవత్సరాల కోర్సుల్లో చదివే విద్యార్థులకు ప్రతి నెలా 1,17,000 యెన్‌(రూ.63,300) సాయం అందుతుందని తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 2000 ఏప్రిల్‌ 2 లేదా ఆ తర్వాత జన్మించిన వారై ఉండాలని, 11 లేదా 12వ తరగతిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే వారికి 80 శాతం, సాంకేతిక శిక్షణ కోర్సుల్లో చేరే వారికి 65 శాతం మార్కులు ఉండాలని, జపనీస్‌ భాషా ప్రావీణ్యం గల వారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 19 నుంచి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. విద్యార్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో తమ దరఖాస్తులను ‘జపాన్‌ కాన్సులేట్‌-జనరల్‌, 12/1, సెనోటాఫ్‌ రోడ్‌, ఫస్ట్‌ స్ట్రీట్‌, తేనాంపేట్‌, చెన్నై 600018’ చిరునామాకి పంపించాలని సూచించింది. ఈ మెయిల్‌ అనుమతించబోమని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల విద్యార్థులకు జూన్‌ 22న, సాంకేతిక కళాశాలల్లో శిక్షణ కోర్సుల్లో చేరే విద్యార్థులకు జూన్‌ 23న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారిని ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తామని వెల్లడించింది. మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌ https://www.chennai.in.emb-japan.go.jp/itpr_en/00_000029.html నుంచి పొందాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని