‘గ్రేటర్‌’ విద్యుత్‌ డిమాండ్‌!

హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో విద్యుత్‌ వినియోగం అమాంతం పెరుగుతోంది.

Published : 19 Apr 2024 04:06 IST

హైదరాబాద్‌లో 4,053 మెగావాట్ల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో విద్యుత్‌ వినియోగం అమాంతం పెరుగుతోంది. ఈ మేరకు గురువారం (ఈ నెల 18న) హైదరాబాద్‌ నగర చరిత్రలోనే అత్యధికంగా 4,053 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. దేశంలో ఏకంగా కొన్ని రాష్ట్రాల కన్నా ఇది అధికంగా ఉండటం గమనార్హం. వేసవి నేపథ్యంలో సాధారణంగా నగరంలో ఏటా మే నెలలో గరిష్ఠ డిమాండ్‌ నమోదవుతుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కొత్త రికార్డు నమోదైంది. గత మూడేళ్ల డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది నెలనెలా 16 నుంచి 20 శాతం పెరుగుదల నమోదవుతోంది. గత జనవరిలో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ పనులు పక్కాగా పూర్తిచేయడం.. ఎక్కడైనా సరఫరాలో సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే పరిష్కరిస్తుండటం.. వంటి చర్యలతో ఈ సీజన్‌లో అంచనాలకు మించి విద్యుత్‌ డిమాండ్‌, వినియోగం నమోదవుతున్నట్లు విద్యుత్‌ ఇంజినీర్లు చెబుతున్నారు.  అన్ని రంగాల వారికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు, సిబ్బంది నిత్యం వినియోగదారులకు అందుబాటులో ఉండి యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు.

  • గ్రేటర్‌ పరిధిలో మార్చి నెలలో విద్యుత్‌ గరిష్ఠ డిమాండ్‌ను పరిశీలిస్తే.. 2022 కంటే 2023లో 2.51% మాత్రమే పెరుగుదల ఉండగా, గత ఏడాది కంటే 2024లో ఏకంగా 20.04% పెరిగింది.  
  • 2022తో పోలిస్తే 2023 ఏప్రిల్‌లో గరిష్ఠ డిమాండ్‌ కేవలం 1.81%పెరగ్గా..2024 ఏప్రిల్‌లో (ఇంతవరకు) 16.11% పెరుగుదల నమోదయింది.  2024 ఏప్రిల్‌లో 17.59% పెరిగింది.
  • ఈ నెల 17న 24గంటల వ్యవధిలో రాష్ట్రమంతా కలిపి 24.54 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైంది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 7.85 కోట్ల యూనిట్లను వినియోగించారు. అలాగే రాష్ట్రం మొత్తంగా గురువారం మధ్యాహ్నం ఎండల వేడి సమయంలో 11,595 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది.
  • భూగర్భ జలమట్టాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రాక వ్యవసాయానికి వినియోగం తగ్గి రాష్ట్రం మొత్తం మీద డిమాండ్‌ తగ్గింది. ఈ మేరకు గత నెల 8న గరిష్ఠ స్థాయిలో 15,623 మెగావాట్ల డిమాండ్‌ నమోదవగా ఈ నెల 14న అది 10,705 మెగావాట్లకు తగ్గింది.

భవిష్యత్తులోనూ ఇలాగే సేవలందించాలి: భట్టి

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో.. నిరంతర కరెంటు సరఫరాను అందిస్తున్న విద్యుత్‌ శాఖను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాగే సేవలు అందించాలని ‘ఎక్స్‌’ వేదికగా గురువారం సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని