ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది.

Published : 19 Apr 2024 04:09 IST

శంకర్‌రావు, రంజిత దంపతుల మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు
నేడు చల్లగరిగెకు తరలింపు

చిట్యాల, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్‌రావు అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళి, ఆయన భార్య దాశేశ్వర్‌ అలియాస్‌ సుమన అలియాస్‌ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ రీజియన్‌ కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన శంకర్‌రావు ఉన్నట్లు వెల్లడి కావడంతో.. తల్లి రాజపోచమ్మ, కుటుంబ సభ్యులు గురువారం ఉదయం కాంకేర్‌కు చేరుకుని, అక్కడ శంకర్‌రావు, రంజితల మృతదేహాలను గుర్తించారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌కు చెందిన  రంజిత మృతదేహాన్ని కూడా తీసుకెళ్తామని శంకర్‌రావు కుటుంబ సభ్యులు  కోరడంతో పోలీసులు అనుమతిచ్చారు. శుక్రవారం ఉదయం మృతదేహాలు చల్లగరిగె చేరుకునే అవకాశం ఉంది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చల్లగరిగెకు చెందిన రాజపోచమ్మ, ఓదేలు దంపతుల కుమారుడైన సిరిపెల్లి సుధాకర్‌ అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ పట్ల ఆకర్షితుడై చిన్నతనంలోనే ఉద్యమ బాట పట్టారు. 1998లో జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక 2000 సంవత్సరంలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమంలోనే రంజితను వివాహం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని