మావోయిస్టుల ఏరివేతలో సింగం

ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు.

Published : 19 Apr 2024 04:10 IST

ఆరు రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌
కాంకేర్‌ ఘటనకు నాయకత్వం

కొత్తగూడెం, న్యూస్‌టుడే: ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిసు’్ట లక్ష్మణ్‌. ఇప్పటివరకు 100కు పైగా యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొన్న ఈ ఇన్‌స్పెక్టర్‌.. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన ఆపరేషన్‌కు వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ ఘటనలో సవాళ్లను ఆయన మీడియాకు వివరించారు.
‘‘కొటారీ నదికి అవతలి వైపు ఉండే కొండ ప్రాంతాన్ని మావోయిస్టుల ‘లిబరేషన్‌’ జోన్‌గా పిలుస్తారు. వారికి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో సమావేశమైనట్లు సమాచారం రాగానే ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం.  200 మంది భద్రతా సిబ్బందితో అతి కష్టమ్మీద అక్కడికి చేరుకున్నాం. మంగళవారం ఉదయం మావోయిస్టులపై మెరుపుదాడి చేయాలని ప్రయత్నించినప్పుడు.. మావోయిస్టు సంఘ సభ్యుడు ఒకరు బాంబులు పేల్చి అగ్రనాయకులకు హెచ్చరికలు జారీచేశాడు. ఫలితంగా మేం కొన్ని గంటలపాటు అక్కడే దాక్కోవాల్సి వచ్చింది. మావోయిస్టు క్యాంపునకు 300 మీటర్ల సమీపానికి చేరుకున్న తర్వాత మా కదలికలను వారు పసిగట్టకుండా ఉండేందుకు పాకుతూ వెళ్లాం. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేశాం. అయినా మా రాకను తెలుసుకొని కాల్పులు ఆరంభించారు. మేం ఎదురుకాల్పులకు దిగాం.. అని లక్ష్మణ్‌ వివరించారు.

39 ఏళ్ల లక్ష్మణ్‌ కేవత్‌ 2007లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అయిదేళ్లకు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం పఖంజూర్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌ఛార్జిగా, డీఆర్‌జీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా కాంకేర్‌ ఆపరేషన్‌కు లక్ష్మణ్‌ నాయకత్వం వహించారు. తన సర్వీసులో 44 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు.


కాంకేర్‌ ఎదురుకాల్పుల్లో మృతులు వీరే..
వెల్లడించిన మావోయిస్టులు

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన తమ సహచరుల వివరాలను మావోయిస్టు పార్టీ అనుబంధ దండకారణ్య క్రాంతికార్‌ ఆదివాసీ మహిళా సంఘటన్‌ కార్యదర్శి రామ్‌కో గురువారం మీడియాకు విడుదల చేసిన లేఖలో వెల్లడించారు. 29 మంది మృతుల్లో ఇద్దరి వివరాలు అందుబాటులో లేవని తెలిపారు. చోటేబేటియా పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన నమ్మకద్రోహం కారణంగా భయంకర ఎన్‌కౌంటర్‌లో తమ సహచరులు వీరమరణం పొందారని పేర్కొన్నారు. వీరిలో శంకర్‌ (డీవీసీఎం) భూపాలపల్లి జిల్లా, రంజిత.. ఆదిలాబాద్‌కు చెందిన వారు కాగా... భద్రు, అనిత, వినోద్‌, రీటా, రమేశ్‌, బచ్నూ, సురేఖ, కవిత, భూమె, కార్తీక్‌, రోషన్‌, దేవళ్‌, దినూ, అన్వేష్‌, జనీలా, సంజిలా, గీత, రాజు, షర్మిల, సునీల, శాంతిలా, పింటో, బజ్నాత్‌, శీలా, జయనీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని