పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు

రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి.

Published : 20 Apr 2024 06:14 IST

9 జిల్లాల్లో 44.3 నుంచి 44.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు
పలు జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు
వడదెబ్బతో ఇద్దరు, పిడుగు శబ్దానికి భయపడి ఒకరు మృతి

ఈనాడు, హైదరాబాద్‌- నిజామాబాద్‌ వ్యవసాయం, హుస్నాబాద్‌ రూరల్‌, మహేశ్వరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. ఈ రెండింటితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి, ఆదిలాబాద్‌, ములుగు, జగిత్యాల, ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో 44.3 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన తాపీమేస్త్రీ చిలపాక సాల్మన్‌(50), నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన కూలీ రామగిరి లక్ష్మీనర్సయ్య(48) వడదెబ్బతో మృతిచెందారు.

చెల్లాచెదురైన ధాన్యం

నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షంతోపాటు వడగళ్లు పడ్డాయి. ఈ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో 5.5 సెంటీ మీటర్లు, డొంకేశ్వర్‌ 4.6, నిజామాబాద్‌ గ్రామీణం 4, రంగారెడ్డి జిల్లా కందుకూరు 3.5, ఆలూరు 2.7, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి 2.7, నల్గొండ జిల్లా గుర్రంపోడు 2.7, చింతలపల్లి 2.4, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో 2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి కల్లాలు, రోడ్లపై ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి హైదరాబాదు-శ్రీశైలం జాతీయ రహదారిపై రాచలూరు గేటు వద్ద భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో మూడు గంటలకుపైగా ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

మహేశ్వరం పరిధి తుమ్మలూరు గ్రామానికి చెందిన మారమోని జంగయ్య(45) పొలం వద్ద పనిచేస్తుండగా వర్షం కురవడంతో తన భార్య, అన్నయ్య, కూలీలతో కలిసి గుడిసె వద్ద తలదాచుకున్నారు. అదే సమయంలో సమీప ప్రాంతంలో పిడుగు పడడంతో ఆ శబ్దానికి జడుసుకున్న జంగయ్య కుప్పకూలిపోయాడు. వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని అనాజ్‌పూర్‌లోనూ ఈదురుగాలుల ధాటికి గ్రామ ప్రధాన రహదారిపై పలు చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలాయి. దీంతో అబ్దుల్లాపూర్‌మెట్‌-అనాజ్‌పూర్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లోనూ పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని