సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 20 Apr 2024 06:15 IST

ఈనాడు, హైదరాబాద్‌-సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌తోపాటు సెర్ప్‌లో పనిచేస్తున్న మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించి 106 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 129, 134 కింద సస్పెన్షన్‌ వేటు వేశారని, పిటిషనర్లకు ఈ సెక్షన్‌లు వర్తించవని తెలిపారు. పిటిషనర్లు రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కారని, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించలేదన్నారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి వేతనాలు పొందడంలేదని, సెర్ప్‌ నుంచి రూ.5 వేలు గౌరవ వేతనం మాత్రమే పొందుతున్నారని చెప్పారు. అందువల్ల పిటిషనర్లను నియమించే లేదా తొలగించే అధికారం కలెక్టర్‌కు లేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 26కు వాయిదా వేశారు.

రాజకీయ కుట్రదారులకు చెంపపెట్టు: వెంకట్రామిరెడ్డి

పొరుగుసేవల ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ కుట్రదారులకు చెంపపెట్టు లాంటిదని మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. స్వార్థబుద్ధితో కుట్రలు చేసినా ధర్మమే గెలిచిందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది తీర్పు కూడా వారికి అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


అరూరికి భద్రత కల్పించండి

ఈనాడు, హైదరాబాద్‌: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌కు 1+1 పోలీసు భద్రత కల్పించాలంటూ శుక్రవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భద్రతను ఉపసంహరించారని, తనకు 2+2 భద్రత కల్పించాలంటూ అరూరి రమేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పిటిషనర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రతను ఉపసంహరించారన్నారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజకీయ కక్షలతో దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉన్నందున రమేశ్‌కు 1+1 భద్రత కల్పించాలంటూ వరంగల్‌ నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని