ఫోన్‌ ట్యాపింగ్‌ అత్యంత ప్రమాదకరం

పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్‌ ట్యాపింగ్‌ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Published : 20 Apr 2024 06:15 IST

కరెంటు రాకపోతే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తాం
మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్‌ ట్యాపింగ్‌ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ఏర్పాటుచేసిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘చాలామందిని ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలు చేశారని పత్రికల్లో కూడా వచ్చింది. ఇలాంటివి ఏ పాలకులు చేసినా ఖండించాల్సిందే. మిగతా వారికన్నా తెలంగాణ సమాజం భావస్వేచ్ఛను, వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం వ్యక్తిగత జీవితాల్లో, రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో కూడా చొరబడింది. ఫోన్‌ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం, కర్మ మాకు లేవు. అందరూ సర్వస్వతంత్రంగా బతకాలని మేం కోరుకుంటున్నాం. వారి ఆలోచనలే మిగతావారికి ఉంటాయని ఊహించుకుని భారాస నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తోందని మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చాలా మంచిపనులు చేస్తున్నారు. ఆయన ప్రధాని మోదీని కలిశారని కావాలని రాజకీయ అభాండాలు వేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేసేవారికి పరిపక్వత లేదనుకుంటున్నాం. రుణమాఫీ గురించి స్పష్టత ఉంది. వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. ఆర్థిక పరిస్థితిని చూసుకుని తప్పకుండా రుణమాఫీ చేస్తాం.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ నెల 15 వరకు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమ పథకాల రాయితీలు కలిపి మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం.

ఫేక్‌ న్యూస్‌ సృష్టించేవారిపై కేసులు

కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ వ్యాపింపజేసేవారిపై కేసులు పెట్టాలని విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలకు గట్టిగా సూచించా. ఎవరికైనా కరెంటు రాక ఇబ్బందులుంటే సీఎండీలకు గానీ, నా కార్యాలయానికి గానీ సమాచారం ఇస్తే వెంటనే సరిచేస్తాం. కరెంటు కోతలు విధిస్తున్నారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై నేను విచారణ చేయిస్తే వాటిలో నిజం లేదని తేలింది.

తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు పెడతాం

గత భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు కట్టే కార్యక్రమాన్ని మాకు అప్పగించింది. మేం ఆ పనిలో ఉన్నాం. విద్య, వైద్యం మా ప్రభుత్వానికి ప్రాధాన్య రంగాలు. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు పెడతాం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపైనా దృష్టి పెట్టాం. మొత్తం స్టడీ చేయాలని, నియంత్రించాలని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాం.


నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం

నీటి వనరుల్లో అన్యాయం జరుగుతుందనే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడాం. నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. కోడ్‌ తర్వాత ఆ ప్రకారం మా నిర్ణయాలు ఉంటాయి. వానాకాలంలో పడిన వర్షపునీటిని గత ప్రభుత్వం కాపాడలేదు. అలా చేయకపోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే కరవు అని ఇప్పుడు కొందరు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను కలిపి చేపట్టాలి. గతంలో కాంగ్రెస్‌ పాలనలో ఇలాగే జరిగింది. కానీ మధ్యలో మిడిమిడి జ్ఞానంతో, న్యారో మైండ్‌తో వచ్చిన రాజకీయ పార్టీలు అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు సమస్యలు వచ్చాయి.రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇవ్వాలని సంకల్పించాం. మానవ వనరులను సక్రమంగా పెంచి పోషిస్తే వారి ద్వారా లెక్కలేనంత ఆదాయం వస్తుంది. కొంతమంది లోతుల్లోకి పోకుండా సంక్షేమానికి నిధులు దుబారా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మా పథకాలు పేదలను ఆర్థికంగా నిలబెట్టడానికే తప్ప ఎవరో కొందరు వ్యక్తులకు దానం చేయడానికి కాదు.


కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చిందన్నది పచ్చి అబద్ధం

కేంద్రం నుంచి గత పదేళ్లలో రూ.10లక్షల కోట్లు వచ్చినట్లు కొందరు చెపుతున్న మాటలు పచ్చి అబద్ధం. వచ్చింది రూ.3.70లక్షల కోట్లే. అవీ మనకు హక్కుగా రావాల్సినవే. గత భారాస ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రూ.3,690 కోట్ల లోటు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పింది. మరి రైతుబంధుకు కేటాయించిన రూ.7వేల కోట్లు ఏమయ్యాయి? మీరే(కేసీఆర్‌) తిన్నారా? ఎవరి దగ్గర ఉన్నాయో ప్రజలకు చెప్పండి. ఎన్టీపీసీని విస్మరించి యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణాలను ఎవరి ప్రయోజనాల కోసం ప్రారంభించారు? రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాలసీ తెస్తాం. గత ప్రభుత్వం చేసిన పాత బాకీలకు కిస్తీల కింద నాలుగు నెలల్లో రూ.26,374 కోట్లు చెల్లించాం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా ప్రభుత్వానికి ఐదేళ్ల దాకా ఢోకా లేదు. రైతుల ఆత్మహత్యలు అనేవి నిరాధారమైన ఆరోపణలు మాత్రమే. 65 లక్షల మందికి రైతు భరోసా కింద రూ.5,575 కోట్లను జమ చేశాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని