శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు

శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్‌లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది.

Published : 20 Apr 2024 05:32 IST

 జన్యుపరమైన మూలాలను గుర్తించిన సీసీఎంబీ

ఈనాడు, హైదరాబాద్‌ : శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్‌లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. శ్రీలంకలో స్వల్ప సంఖ్యలో అడవుల్లో నివసించే వేద జనాభా మాట్లాడే భాష, సాంస్కృతిక లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. భారత్‌లోని గిరిజనుల అలవాట్లతో పోలికలు కనిపించేవి. కానీ జన్యుమూలాల గురించి శాస్త్రీయంగా ఆధారాలేమీ లేవు. ఈ కారణంగానే ఎంతోకాలంగా చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వీరి మూలాలను తెలుసుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్‌లోని సీసీఎంబీతో పాటు మరో నాలుగు సంస్థల్లోని 10 మంది పరిశోధకులు వేద జనాభా మూలాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ‘శ్రీలంకలో జీవిస్తున్న వేద జనాభా నుంచి డీఎన్‌ఏ సేకరించాం. మన వద్ద ఉన్న డీఎన్‌ఏ డేటా బ్యాంకుతో పోల్చి చూశాం. కల్లార్‌, పలియార్‌ వంటి దక్షిణాదికి చెందిన గిరిజన సమూహాలతో సారూప్యతలు కనిపించాయి. వీరంతా . వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి భారత్‌కు వలస వచ్చిన అనంతరం ఇక్కడి నుంచి కొన్ని తెగలు శ్రీలంకకు వలస వెళ్లి ఉండవచ్చు’ అని పరిశోధనలో పాలుపంచుకున్న సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు. శ్రీలంకతోనే కాదు దక్షిణాసియా దేశాలతోనూ మనకు జన్యుపర సంబంధాలున్నాయి. అందువల్ల దక్షిణాసియాలోని జన్యు వైవిధ్యాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి పేర్కొన్నారు. ఈ పరిశోధన తాజాగా మైటోకాండ్రియన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని