నీటి లోతుల్లో నిఘా కళ్లు!

తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది.

Updated : 20 Apr 2024 06:44 IST

అగ్నిమాపక శాఖలోమరింత ఆధునిక పరిజ్ఞానం
నీటిలో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. ఫైర్‌ రోబో, ఫైర్‌ ఫైటింగ్‌ డ్రోన్ల వంటి వాటితో పాటు ఐదేసి చొప్పున అండర్‌ వాటర్‌ సోనార్‌ స్కానర్‌, రిమోట్‌ కంట్రోల్డ్‌ లైఫ్‌బాయ్‌ పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఒక్కో సోనార్‌ స్కానర్‌ ఖరీదు సుమారు రూ.9.5 లక్షలు.. లైఫ్‌బాయ్‌ విలువ రూ.8.5 లక్షలు ఉంటుంది. పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది. త్వరలోనే వీటిని సమకూర్చుకోనున్నట్లు అగ్నిమాపక సేవల శాఖ వర్గాలు వెల్లడించాయి.

రిమోట్‌ కంట్రోల్డ్‌ లైఫ్‌బాయ్‌

ఈ మానవ రహిత రక్షిత వాహనాన్ని వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వాడతారు. ఎవరైనా సుదూరప్రాంతంలోని నీటి ప్రవాహంలో గనక చిక్కుకుంటే మాన్యువల్‌గానే కాకుండా రిమోట్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని పంపిస్తారు. దీనికి తాడు ఆధారంగా ఉంటుంది. బాధితులు ఆ తాడును పట్టుకొని ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉంటుంది.

  •  18 కిలోల బరువుండే ఈ పరికరం 120 సెం.మీ.ల పొడవు.. 85 సెం.మీ.ల వెడల్పు.. 25 సెం.మీ.ల ఎత్తు ఉంటుంది. గంటకు 18 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుంది. గ్లాస్‌ ఫైబర్‌తో కూడిన పాలిస్టర్‌ సామగ్రి  ఇందులో ఉంటుంది.
  •  లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగిఉండే ఈ పరికరాన్ని ఒక్కసారి ఛార్జి చేస్తే కనీసం గంటపాటు పనిచేస్తుంది. 100 కిలోల బరువున్న వ్యక్తిని తీసుకొచ్చే సామర్థ్యం దీనికి ఉంది.
  •  ఇది రెండువైపులా నాలుగు హ్యాండిల్స్‌ ఉంటాయి. తద్వారా వరదల్లో చిక్కుకున్నవారిని సులభంగా బయటకు తీసుకురావచ్చు.
  •  రిమోట్‌ ఆధారంగా 800 మీటర్ల దూరం వరకు వెళ్లగలుగుతుంది. ఒడ్డున ఉండే ఏ వైపునకైనా పంపించొచ్చు. ఒకవేళ సాంకేతికలోపం కారణంగా కమ్యూనికేషన్‌ గనక లోపిస్తే వెంటనే యథాస్థానానికి తిరిగి చేరుకుంటుంది.

హ్యాండ్‌హెల్డ్‌ అండర్‌వాటర్‌ సోనార్‌ స్కానర్‌

నీటిలోపల చిక్కుకుపోయిన లేదా మునిగిన వాహనాల్లో ఉండిపోయిన మనుషులను రక్షించేందుకు వినియోగించే పరికరం ఇది. సోనార్‌ సాంకేతిక కారణంగా మానవశరీరాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంటుంది. నీటి అడుగుభాగంలోని రాళ్లురప్పలతో, మానవ శరీరాలను వేరుచేసి గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో వీలైనంత వేగంగా సమాచారం అందిస్తుంది.

  • నీటిలోపల 164 అడుగుల వరకు ఇది వెళ్లగలుగుతుంది. 16.5 అడుగుల లోతు వరకు తీసుకెళ్లి ఆపరేట్‌ చేసే అవకాశముండటంతో మొత్తం 180 అడుగుల లోతులోని శరీరాలను గుర్తించగలుగుతుంది.
  • 2 కిలోల బరువుండే ఈ పరికరం కేవలం 2 నిమిషాల్లోనే 43 వేల చదరపు అడుగుల మేర విస్తీర్ణాన్ని స్కాన్‌ చేస్తుంది. ఒకసారి ఛార్జి చేస్తే కనీసం 10 గంటల పాటు వాడవచ్చు.
  • ఈ పరికరం డేటా విజువలైజేషన్‌ స్క్రీన్‌తో కూడి ఉండటంతో తేలికపాటి చిత్రాలను సైతం పంపించగలుగుతుంది. దీనికి ట్రిగ్గర్‌ స్విచ్‌ ఉండటంతో అవసరమైనప్పుడు స్కానింగ్‌ను ఆరంభించే అవకాశముంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని