14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు

రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్‌ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.

Published : 20 Apr 2024 05:38 IST

ఐదు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌
రాష్ట్రంలో వానాకాలం సీజన్‌కు ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్‌ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆయిల్‌పామ్‌ సహా కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ తోటలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఆహార, వాణిజ్య, ఇతర వ్యవసాయ పంటల సాగు ఏటేటా పెరుగుతున్నా కూరగాయల సాగులో ఆశించిన పురోగతి లేదు. పండ్లు, కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గతంలో కంటే ఎక్కువగా ఈ వానాకాలం సీజన్‌లో ఉద్యాన పంటలను సాగు చేయాలనే లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించింది.

ఏవేవి.. ఎన్నెన్ని ఎకరాల్లో..!

మొత్తం 14 లక్షల ఎకరాల్లో ఐదు లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్‌ సాగుకు ఉద్యాన శాఖ నిర్దేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.02 లక్షల మేరకు ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. రాష్ట్రంలో వంట నూనెల జాతీయ పథకం (ఎన్‌ఎంఈవో) పథకం కింద 11.82 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు కోసం 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఇందులో లక్షన్నర ఎకరాలు (14 శాతం లక్ష్యం) మాత్రమే ఈ సంస్థలు సాధించాయి. దీంతో ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చి మూడు లక్షల ఎకరాలకు పెంచాలని భావిస్తోంది. దీంతో పాటు మరో రెండు లక్షల ఎకరాలను రైతులతో సాగు చేయించాలని భావిస్తోంది.

మిర్చి సాగు 3.5 లక్షల ఎకరాలకు పెంచాలి

రాష్ట్రంలో మిర్చి ప్రస్తుతం 2.38 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా..దానిని 3.5 లక్షల ఎకరాలకు పెంచాలని, పసుపు 1.34 లక్షల ఎకరాలుండగా..దానిని రూ.1.50 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్దేశించింది.

  •  టమాటా లక్ష ఎకరాలు, వంకాయ, ఉల్లి గడ్డ, బెండ, బీన్స్‌ 30 వేల ఎకరాల చొప్పున, క్యారెట్‌, క్యాబేజీ, బీర, కాలీఫ్లవర్‌ 20 వేల ఎకరాల చొప్పున పెంచాలని సూచించింది. ఆకుకూరల సాగు లక్షన్నర ఎకరాల్లో సాగు చేస్తారు. కూరగాయలు, ఆకు కూరల సాగుకు క్రాప్‌కాలనీలను పెద్దఎత్తున చేపడతారు.
  •  రాష్ట్రంలో ప్రస్తుతం 3.12 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలున్నాయి. అందులో మామిడి అధికంగా ఉండగా జామ, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, తోటలున్నాయి. పాలీహౌస్‌లు ఇతర మార్గాల ద్వారా మరో 50 వేల ఎకరాల్లో ద్రాక్ష, అరటి తోటల వంటి వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ ప్రతిపాదించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని