24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండోసంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు.

Published : 21 Apr 2024 09:07 IST

మొదటి, రెండో సంవత్సరం ఒకేసారి విడుదల
30 లేదా వచ్చేనెల 1న పదో తరగతివి

ఈనాడు,హైదరాబాద్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండోసంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు పదోతరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 తేదీ నుంచి మూల్యాంకనం చేపట్టి ఈనెల 10 వ తేదీన పూర్తి చేశారు. మార్కుల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. 2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు.

పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థినీవిద్యార్థులు పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తయింది. వారం రోజులపాటు ఫలితాల డీకోడింగ్‌ అనంతరం ఈనెల 30న లేదా వచ్చే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని