ఫోన్‌ పోయిందా.. మీరే బ్లాక్‌ చేయొచ్చు

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్‌ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్‌ల ద్వారా మాల్‌వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్‌ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు.

Updated : 21 Apr 2024 09:21 IST

మీ పేరుతో ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా?
సైబర్‌ నేరాలకు ‘సంచార్‌ సాథి’ పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన సైబర్‌ నేరాలు ఇప్పుడు గ్రామీణంలోకి చొచ్చుకువచ్చి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. మోసగాళ్లు లింక్‌ల ద్వారా మాల్‌వేర్లు పంపించడం.. బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్‌ చేయడం.. ఓటీపీలు తెలుసుకోవడం.. లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులే. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో ‘సంచార్‌ సాథి’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా https://sancharsaathi.gov.in పోర్టల్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతోపాటు సైబర్‌ నేరాల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని తెలుసుకునే వీలు కల్పించారు.

చక్షు

సైబర్‌ నేరస్థులు కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ల ద్వారా మోసం చేసేందుకు యత్నించారని గుర్తిస్తే ‘చక్షు’లో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్‌ వ్యాలెట్‌, సిమ్‌, గ్యాస్‌ కనెక్షన్‌, ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌, కేవైసీ అప్‌డేట్‌, ఎక్స్‌పైరీ, డీయాక్టివేషన్‌, ఇంపర్సనేషన్‌(ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడటం), సెక్స్‌టార్షన్‌.. తదితర మోసాలకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదులో పేర్కొనవచ్చు.

నో యువర్‌ మొబైల్‌(కేవైఎం)

తక్కువ ధరకు వస్తుందని సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్లు కొని అమాయకులు చిక్కులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ కొనేముందు దాని పూర్వాపరాల గురించి తెలుసుకునేలా ‘నో యువర్‌ మొబైల్‌(కేవైఎం) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఫోన్‌ వ్యాలిడిటీని దాని ఐఎంఈఐ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్‌లో *#06# డయల్‌ చేయడం ద్వారా ఐఎంఈఐ నంబర్‌ వస్తుంది. దాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ ఫోన్‌ ‘బ్లాక్‌లిస్టెడ్‌’, ‘డూప్లికేట్‌’, ‘ఆల్‌రెడీ ఇన్‌ యూజ్‌’ అని గనక వస్తే కొనకుండా ఉండటం మంచిది.

నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌(టాఫ్‌కాప్‌)

సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లపై ఉన్న సిమ్‌కార్డులను వినియోగించి మోసాలకు పాల్పడటం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఇతరుల ధ్రువీకరణపత్రాల్ని సేకరించి వాటి ఆధారంగా సిమ్‌కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెలీకామ్‌ అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌(టాఫ్‌కాప్‌) ఫీచర్‌ను డీవోటీ తెర పైకి తెచ్చింది. ఎవరైనా ఓ వ్యక్తి తనకు తెలియకుండానే తన పేరుపై ఇతరులు సిమ్‌కార్డు వినియోగిస్తున్నారా..? అని తెలుసుకునే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్‌నంబర్‌ను నిక్షిప్తం చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి లాగిన్‌ అయితే మొత్తం ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయి అనేది తెలుస్తుంది. తెలియనివి ఉంటే రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయించొచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి 65,23,541 రిక్వెస్ట్‌లు రాగా.. 55,57,507 పరిష్కరించారు.

సీఈఐఆర్‌

ఫోన్లు పోయినా లేదా అపహరణకు గురైనప్పుడు వెంటనే దాన్ని బ్లాక్‌ చేసి పనిచేయకుండా చేసే సదుపాయం అందుబాటులో ఉంది. తిరిగి దొరికిన తర్వాత అన్‌బ్లాక్‌ చేసి పనిచేసేలా చేసుకోవచ్చు. దీనికోసమే సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి ఈ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న 15,43,666 ఫోన్లను ఇప్పటివరకు బ్లాక్‌ చేశారు. వాటిల్లో 8,47,140 తిరిగి బాధితులకు అప్పగించగలిగారు. వీటిల్లో ఒక్క తెలంగాణలోనే 26,833 ఫోన్లు రికవరీ చేయగలిగారు.

రిక్‌విన్‌

విదేశాల నుంచి ఫోన్లు చేసి సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి నేరస్థులు విదేశాల నుంచి ఫోన్‌ చేస్తున్నా నంబర్‌ మాత్రం భారత్‌ కోడ్‌తోనే ఉంటోంది. నేరస్థులు మాట్లాడే భాషను బట్టి విదేశీయులని బాధితులు సులభంగా గుర్తు పడుతున్నారు. అలాంటి కాల్స్‌ గురించి ‘రిపోర్ట్‌ ఇన్‌కమింగ్‌ ఇంటర్నేషనల్‌ కాల్‌ విత్‌ ఇండియన్‌ నంబర్‌(రిక్‌విన్‌)’ ఫీచర్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు ఆ నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని