మండు వేసవిలో ముంచెత్తిన వాన

రాష్ట్రంలో శనివారం ఉదయం అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తించాయి. తీవ్ర ఎండలు కాస్తున్న తరుణంలో.. ఈస్థాయి వర్షాలను ఊహించలేక తీవ్రంగా నష్టపోయారు.

Updated : 21 Apr 2024 05:35 IST

పలు జిల్లాల్లో భారీ వర్షాలు
మార్కెట్‌ యార్డుల్లో తడిసి ముద్దయిన ధాన్యం
వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకూ నష్టం
పదుల ఎకరాల్లో నేలరాలిన మామిడి
నష్టంపై నివేదిక కోరిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం ఉదయం అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తించాయి. తీవ్ర ఎండలు కాస్తున్న తరుణంలో.. ఈస్థాయి వర్షాలను ఊహించలేక తీవ్రంగా నష్టపోయారు. జనగామ జిల్లా నర్మెట్టలో రాష్ట్రంలోనే అత్యధికంగా 4.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో 3.3, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో 2.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హనుమకొండ, వికారాబాద్‌ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. వరి, మొక్కజొన్న, వేరుసెనగ, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన మామిడి, నిమ్మ, బత్తాయి కాయలు రాలిపోయాయి. పిడుగుపాటుకు పశువులు మృత్యువాతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి మళ్లీ ఎండ తీవ్రత మొదలైంది. దీంతో గాలిలో తేమశాతం పెరిగి తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా వైరాలో 43.8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 43.7, సూర్యాపేట జిల్లా మటంపల్లిలో 43.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

వాలిన వరి.. రాలిన మామిడి

నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, యాదాద్రి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, వరంగల్‌, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్‌, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, గద్వాల జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోత దశలో ఉన్న వరి చేతికి రాకుండా పోగా.. మొక్కజొన్న కంకులు రాలిపోయాయి. పొలాల్లో నీరు చేరి వేరుసెనగ, పెసలు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. నీటిని బయటకు పంపేందుకు రైతులు నానా ప్రయాసలు పడుతున్నారు. సుమారు 100 ఎకరాల్లోని మామిడితోటల్లో కాయరాలింది. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం బుద్వాన్‌పూర్‌లో పిడుగుపాటుకు మూడు గేదెలు చనిపోయాయి. రైతులు మార్కెట్‌యార్డులకు తీసుకొచ్చిన ధాన్యం, జొన్నలు, కందులు ఇతర పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన వడ్లు నీటిపాలయ్యాయి. పలు జిల్లాల్లో ఇంకా ముసురుపట్టి ఉండడంతోపాటు వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పొలాల్లో పంటలను రక్షించే దారి లేక తలలు పట్టుకున్నారు.

రైతుల వారీగా నష్టం వివరాలివ్వాలి

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్లతో సిద్దిపేట, యాదాద్రి, నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు అందాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం ఆయన పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షించారు. ‘దాదాపు 2,200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నివేదిక అందింది. పంట నష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించి రైతు వారీగా పంట నష్టం వివరాలు వెంటనే నివేదిక అందజేయాలి. పంట నష్టాన్ని తగ్గించే విధంగా రైతులకు ముందు జాగ్రత్తలు సూచించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాస్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌ యార్డుల్లో ఇప్పటికే 2 లక్షలకుపైగా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాం’ అని మంత్రి తెలిపారు.


రెండు ఎకరాల్లో ధాన్యం నేలరాలింది
- మట్టా రాము, బోర్గాం, నిజామాబాద్‌ జిల్లా

రెండెకరాల సొంత భూమితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాను. మరో వారం రోజుల్లో కోతకు వస్తుందనగా వడగళ్లతో రెండెకరాలకు పైగా పంట దెబ్బతింది. గింజలు రాలిపోయి రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది.


కళ్ల ముందే మామిడికాయలు రాలిపోయాయి
- కొండేటి కనకయ్య, కూరెల్ల, సిద్దిపేట జిల్లా

అయిదెకరాల మామిడి తోట వేశాను. శనివారం ఈదురుగాలులకు నా కళ్లెదుటే కాయలన్నీ రాలిపోయాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లింది. నేలరాలిన కాయలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని