ఎలాగైనా వెళ్లాలి.. ఏపీలో ఓటెయ్యాలి

ఎన్నికల నేపథ్యంలో మే నెలలో ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఎన్నికల్లో ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

Published : 21 Apr 2024 05:28 IST

తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి
ఆ వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్‌
మే 10, 11, 12 తేదీల్లో భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌
ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో మే నెలలో ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు ఎన్నికల్లో ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లాల్సినవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు.  హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది.

మే 13న తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. పోలింగ్‌ సోమవారం జరగనుండటంతో చాలామంది ఆదివారం బయల్దేరేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు.  పోలింగ్‌ రోజుకు రిజర్వేషన్లు దొరక్క కొందరు మూడు రోజుల ముందు కూడా ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. అయినా సరే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. హైదరాబాద్‌ వైపు నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లలో మే 12న రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. శుక్రవారం, శనివారం (మే 10, 11 తేదీలు) కూడా దూరప్రాంత రైళ్లలో ఒక్కో బండిలో వందల సంఖ్యలో వెయిటింగ్‌ లిస్టు ఉంది. కొన్నింట్లో అయితే ఆ పరిమితి కూడా దాటిపోయి ‘రిగ్రెట్‌’ వస్తోంది.

  • అన్ని ఏసీ బోగీలు, అధిక ఛార్జీలుండే సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణంగా అయితే ఒక రోజు ముందు కూడా రిజర్వేషన్‌ దొరుకుతుంది. ఎన్నికలు ఉండటంతో నెలరోజుల ముందే టికెట్లు అయిపోయాయి. 12వ తేదీకి గరీబ్‌రథ్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ 234. స్లీపర్‌లో గమనిస్తే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 265 మంది, ఫలక్‌నుమాలో 240 మంది, విశాఖ ట్రైన్‌లో 182 మంది, ఈస్ట్‌కోస్ట్‌లో 180 మంది వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. 11వ తేదీన గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌, ఏసీల్లో కలిపి 592 మంది వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు.
  • సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే నారాయణాద్రి, శబరి, చార్మినార్‌, పద్మావతి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి స్పెషల్‌ వంటి రైళ్లలో మే 10, 11, 12 తేదీల్లో భారీగా వెయిటింగ్‌ లిస్టు ఉంది. ఎల్‌టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మే 9-12 వరకు నాలుగు రోజులు రిగ్రెట్‌లో ఉంది. 11, 12 తేదీల్లో కోణార్క్‌, జన్మభూమి.. ఇలా పలు రైళ్లు రిగ్రెట్‌లో ఉన్నాయి.

క్లోన్‌ రైళ్లు వేస్తేనే

వేసవిలో ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామని ద.మ.రైల్వే చెబుతున్నా..రద్దీతో పోలిస్తే ఆ సంఖ్య తక్కువే. పైగా ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న రూట్లలో కాకుండా బిహార్‌, బెంగాల్‌ వంటి రాష్ట్రాలవైపు ఉంటున్నాయి. ఏ రైలుకు ఎంత డిమాండ్‌ ఉంది..ఎన్ని వందల మంది వెయిటింగ్‌లో ఉన్నారన్న ముందస్తు సమాచారం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం ఆయా రోజుల్లో ప్రత్యేక రైళ్లు నడపవచ్చు. అవే రూట్లు, దాదాపు అవే సమయాల్లో ప్రత్యేక రైళ్లను వేస్తే వాటిని క్లోన్‌ రైళ్లుగా వ్యవహరిస్తారు. ఎన్నికల తేదీకి రెండు, మూడు రోజుల ముందు కాకుండా వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా వెంటనే క్లోన్‌ రైళ్లను ప్రకటిస్తే ఇటు ప్రయాణికుల్లో ఆందోళన తగ్గడంతో పాటు రైల్వేకూ ఆదాయం వస్తుంది. అలాగే రైలుకు గరిష్ఠంగా 24 బోగీలు ఉంటాయి. డిమాండ్‌ బాగా ఉన్న రైళ్లకు తక్కువ బోగీలు ఉన్న పక్షంలో వాటికి అదనంగా జోడించే విషయాన్నీ పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని