మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి

‘‘మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధననూ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పాటించలేదు.

Updated : 21 Apr 2024 05:33 IST

అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి
మొత్తం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు
పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్థరహితం
నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు నిర్ధారించే విషయంలో ఒప్పందంలోని ఏ నిబంధననూ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పాటించలేదు. బ్యారేజీ కుంగినపుడు తమ సొంత నిధులతో పునరుద్ధరణ పనులు చేస్తామని గత ఏడాది డిసెంబరు 2న లేఖ రాసిన నిర్మాణ సంస్థ తర్వాత దురుద్దేశంతో యూ టర్న్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే తుది ధ్రువీకరణ పత్రం గురించి ప్రస్తావిస్తోంది. అది ఏ మాత్రం సమంజసం కాదు. పని పూర్తయినట్లు తుది ధ్రువీకరణ పత్రం ఇచ్చే ముందు, తర్వాత నిబంధనల ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అసలు బ్యారేజీని పూర్తి చేసి అప్పగించే కార్యక్రమమే జరగలేదు’’ అని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు.

నిర్మాణ సంస్థ బ్యారేజీని సొంత నిధులతో యథాస్థితికి తేవాల్సి ఉందని, అలా చేయకుంటే ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చర్య తీసుకొని జరిగిన నష్టానికి సంబంధించిన మొత్తాన్ని నిర్మాణ సంస్థ నుంచి రికవరీ చేయాలని సూచించారు. 2021 మార్చి 15న పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ రద్దు లేదా ఉపసంహరించుకొనే అంశాన్ని కూడా ఆలోచించాలని కోరారు. పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు కూడా వెనక్కు ఇవ్వడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని, అనుబంధ ఒప్పందం చేసుకొని ఈ పనికి అయ్యే వ్యయాన్ని చెల్లిస్తేనే చేస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నీరుపారుదల శాఖకు పలు దఫాలు లేఖలు రాసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ (రామగుండం) నీటిపారుదల శాఖకు తాజాగా రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది. ఇందులో ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ లోపాలను నివేదించారు.

ముఖ్యాంశాలు ఇవీ...

  • ‘‘మొదట ఈ పనిని రూ.1,849.30 కోట్లకు 24 నెలల్లో పూర్తి చేసేలా ఒప్పందం జరిగింది. తర్వాత ఈ పని అంచనా రూ.2,591 కోట్లకు, రూ.3,260 కోట్లకు.. 2022 ఏప్రిల్‌ నాటికి రూ.4,613 కోట్లకు చేరింది.
  • బ్యారేజీ సీసీ బ్లాకులు, వియరింగ్‌ కోట్‌లకు నష్టం జరిగిందని, ఈ పనులు చేయాలని 2020 మే 18న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు. బ్యారేజీ దిగువన పనులను పూర్తి చేయడానికి, డీవాటరింగ్‌, దెబ్బతిన్న స్ట్రక్చర్లను తొలగించడానికి నాలుగైదు నెలల సమయం పడుతుందని అయితే కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా అవసరమైన వనరులను సేకరించుకోవడం కష్టమని నిర్మాణ సంస్థ తెలిపింది. 2020 నవంబరు 7న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌... బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థ ఒరిజినల్‌ స్కోప్‌ ఆఫ్‌ వర్క్‌తోపాటు అదనపు పనులను కూడా పూర్తి చేసిందని, నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే చేపడతామని అండర్‌టేకింగ్‌ కూడా ఇచ్చిందని ఎస్‌ఈకి నివేదించారు. దీని ఆధారంగానే బ్యాంకు గ్యారంటీల విడుదలకు రాష్ట్ర స్థాయి స్డాండింగ్‌ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లాయి.
  • రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదనను పరిశీలించి చేసిన సిఫార్సు ఆధారంగా రూ.159.72 కోట్ల విలువ గల బ్యాంకు గ్యారంటీల విడుదలకు ఎస్‌ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ బ్యాంకు గ్యారంటీలను ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ విడుదల చేయలేదు. తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ఆధారంగా 2021 జనవరి 23న విడుదల చేశారు.
  • ఒప్పందంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలంటే బ్యారేజీ నిర్వహణ సమయంలో పునరుద్ధరణ పనులు ఉంటే చేస్తామని రాతపూర్వకంగా సంబంధిత ఇంజినీర్‌కు నిర్మాణ సంస్థ అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి. ఈ నోటీసు అందిన 21 రోజుల్లో ఏయే పనులు ఇంకా చేయాల్సి ఉందో అధికారులు కాంట్రాక్టర్‌కు తెలపాలి. అన్ని పనులు పూర్తి చేసినట్లు, ఎలాంటి లోపాలు లేనట్లు భావిస్తే సర్టిఫికెట్‌ ఇవ్వాలి. పని పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో ఆ ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ తన అధీనంలోకి తీసుకోవాలి. ఈ పని నిర్మాణ సంస్థ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఆ పైస్థాయి అధికారి సమక్షంలో జరగాలి. అయితే మేడిగడ్డలో అప్పటివరకు చేసిన పనికి మాత్రమే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని ఎస్‌ఈ నివేదించారు. కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ అంటే మొత్తం పని పూర్తయినట్లు, అన్నీ సంతృప్తికరంగా ఉన్నట్లు నిర్ధారించినట్లు కాదు. మొత్తం పని పూర్తయ్యేంతవరకు కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇచ్చిన సర్టిఫికెట్‌ టెండర్‌ ప్రక్రియ కోసమే.పైగా జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థ పునరుద్ధరించలేదు. రిలీజ్‌ అండ్‌ డిశ్ఛార్జి సర్టిఫికెట్‌ కూడా జారీ చేయలేదు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా తుది సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. పైగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చిన వారం రోజుల్లో నిబంధన ప్రకారం సైట్‌ను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా ఆ పని జరగలేదు. ఈ సర్టిఫికెట్‌ జారీ చేయడంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, తీసుకోవడంలో నిర్మాణ సంస్థ ఒప్పందంలోని నిబంధనలను పాటించలేదు.
  • మొత్తం పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. కొన్ని పెండింగ్‌ పనులు, అదనపు పనులు జరుగుతున్నాయి. ఈ నేఫథ్యంలో పని పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్థరహితం.
  • బ్యాంకు గ్యారంటీల విడుదల విషయంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌)ను తప్పుదోవ పట్టించే ఉద్దేశం మాకు  లేదు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ, ఎస్‌ఈ నివేదిక ఆధారంగానే ప్రతిపాదించాం. అనుకోకుండా పొరపాటు జరిగింది... మన్నించాలని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కోరారు. దీంతోపాటు 2021 ఫిబ్రవరి 17న పెండింగ్‌ పనుల గురించి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిర్మాణ సంస్థకు లేఖ రాశారు. ఈ పనులు ఇప్పటివరకు చేయలేదు.
  • 2020 జనవరిలో గేట్లు మూసిన తర్వాత దిగువన ప్రొటెక్షన్‌ వర్క్స్‌, సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్‌ పక్కకు జరగడం, కొట్టుకుపోవడాన్ని గుర్తించాం. అప్పుడే బ్యారేజీ స్ట్రక్చర్‌ డిస్ట్రెస్‌ కండిషన్‌లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు సూచించాం. అయినా అది దెబ్బతిన్న పనులను బాగు చేసి బ్యారేజీకి తీవ్ర నష్టం వాటిల్లకుండా ఎలాంటి పటిష్ఠ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా పియర్‌/రాఫ్ట్‌ కుంగాయి. బ్యారేజీకి జరిగిన నష్టం గురించి 2020 మే 18నే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు’’ అని చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని