కాంకేర్‌లో తప్పించుకున్న తెలుగు మావోయిస్టులు ఎవరు..?

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా బినాగుండ-కోరకట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Published : 21 Apr 2024 10:04 IST

తెలంగాణ నిఘా విభాగం ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా బినాగుండ-కోరకట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వీరెవరు, ఎటు వెళ్లారన్నదానిపై తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు ముందే సమావేశం గురించి సమాచారంతో పాటు అందులో తెలుగు నాయకులు కూడా పాల్గొంటున్నట్లు తెలంగాణ నిఘా విభాగం ముందే పసిగట్టిందని సమాచారం. రాష్ట్ర సరిహద్దులకు 200 కిలోమీటర్లకు పైగా దూరం ఉండటంతో ఇక్కడ నుంచి గ్రేహౌండ్స్‌ బలగాలను పంపడం సాధ్యం కాదని భావించారు. ఈలోపే  ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం 29 మంది మావోయిస్టులు చనిపోగా ఇందులో ఇద్దరు తెలుగువారు ఉన్న సంగతి తెలిసిందే.

కీలక నేతలు తెలుగువారే...

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణకు చెందిన దాదాపు 140 మంది  ఛత్తీస్‌గఢ్‌లో ఆవాసం పొందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. వీరిలో అనేక మంది కీలక నాయకులు కూడా ఉన్నారు. కేంద్ర కమిటీలో మొత్తం 17 మంది సభ్యులు ఉండగా వారిలో పది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. సైద్ధాంతికంగా మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తుంది వీరే. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలపై తెలంగాణ పోలీసులు కన్నేశారు. తాజా ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్న తెలుగు మావోయిస్టులు ఎవరనే దానిపై తెలంగాణ నిఘా విభాగం దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని