తప్పులు ఒప్పుకొన్నాం.. బాధితులను ఆదుకుంటున్నాం

ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్‌ 20న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అప్పుడు జరిగిన తప్పును ఒప్పుకొని బాధితులను ఆదుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు.

Published : 21 Apr 2024 03:48 IST

రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏలను బలోపేతం చేస్తాం
గిరిజన అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో మంత్రి సీతక్క

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్‌ 20న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అప్పుడు జరిగిన తప్పును ఒప్పుకొని బాధితులను ఆదుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. గిరిజన అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లిలో స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. నాటి ఘటన తర్వాత ఆదివాసీ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ఐటీడీఏలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అటవీహక్కుల చట్టం తీసుకు వచ్చిందని గుర్తుచేశారు. భాజపా, భారాస ప్రభుత్వాలు ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతోపాటు అటవీ హక్కుల చట్టంను తుంగలో తొక్కి 10 ఏళ్లుగా హక్కుపత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కులు కల్పిస్తామని, ఐటీడీఏలను బలోపేతం చేస్తామన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని ఆదివాసీల చేతిలో ఉన్న సాగు భూముల్లోని ఖనిజ సంపదను భాజపా తన స్నేహితులకు దోచి పెట్టేందుకు వీరిపై ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. నివాళులర్పించిన వారిలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్‌, రాఠోడ్‌ బాపురావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్‌ తదితరులు ఉన్నారు.

అమరులకు నివాళులు: ఎంపీ సోయం బాపురావు, భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌, భారాస జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నలతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా గిరిజన అమరులకు నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని