భూ యజమానులకు తెలియకుండానే చేతులు మారిపోతున్నాయ్‌!

2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్‌ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసేవారు.

Published : 21 Apr 2024 03:49 IST

‘ధరణి’లో లొసుగులతో అందుకు ఆస్కారం
క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే లావాదేవీలు
ఏక కాల రిజిస్ట్రేషన్‌/మ్యుటేషన్‌తో ముప్పంటున్న నిపుణులు
తాజాగా ఓ భూ యజమాని కిడ్నాప్‌తో పోర్టల్‌లోని లోపాలు బహిర్గతం

2020 అక్టోబరు 29వ తేదీకి ముందు ఆర్వోఆర్‌ చట్టం అమల్లో ఉండేది. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన భూమి దస్తావేజులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసేవారు. అనంతరం ఆ దస్త్రాన్ని రెవెన్యూ శాఖకు పంపితే తహసీల్దార్‌ కార్యాలయం పది రోజుల్లోపు మ్యుటేషన్‌ (రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల మార్పిడి) ప్రక్రియను ఉచితంగా చేపట్టేది. క్షేత్రస్థాయిలో విచారించి.. మ్యుటేషన్‌ పూర్తి చేసి.. పాసుపుస్తకం జారీ చేసేది.

  • 2020 నవంబరు 2 నుంచి.. ధరణి చట్టం/పోర్టల్‌ అమల్లోకి వచ్చింది. తహసీల్దారు/సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌/మ్యుటేషన్‌ పూర్తి చేస్తున్నారు. మీ-సేవా కేంద్రంలో సదరు భూమికి సంబంధించి ఆ సర్వే నంబర్‌లోని మార్కెట్‌ ధర చెల్లించి, ఎకరాకు మ్యుటేషన్‌ ఫీజు రూ.2 వేలు చెల్లించి.. కేటాయించిన స్లాటు సమయానికి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్తే క్షణాల వ్యవధిలో లావాదేవీ పూర్తవుతోంది. పోస్టులో పట్టా పాసుపుస్తకం వస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విచారణేమీ చేయడం లేదు.

ఈనాడు, హైదరాబాద్‌:  రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్‌/సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వేదికగా ఒకరి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా మార్పిడి చేసిన ఘటన రెండు రోజుల క్రితం పోలీసుల విచారణ సందర్భంగా వెలుగుచూసింది. రూ.కోట్ల విలువ చేసే ఆ భూమి యజమానికి ఇష్టం లేకపోవడంతో అతడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈవిషయం కనీసం అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు. ఇందుకు సాంకేతికత, నిబంధనల్లోని లొసుగులే ఆస్కారమిచ్చాయన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి ఉదంతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ధరణిలో మార్పులు తీసుకొచ్చేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇలాంటి కీలక లోపాలను కట్టడి చేస్తే తప్ప అక్రమాలకు అడ్డుకట్ట పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • బ్యాంకుల్లో నగదు లావాదేవీల తరహాలో భూ లావాదేవీలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే.. భూ యాజమాన్య హక్కును మార్పిడి చేస్తున్న విధానం దేశంలో ఇంకెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా లోపం జరిగితే సవరించుకునే వ్యవస్థ అందుబాటులో ఉండాలని పేర్కొంటున్నారు.
  • పోర్టల్లో జరిగిన లావాదేవీలపై చట్టబద్ధంగా విచారణ చేసే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), జిల్లా కలెక్టర్లకు ధరణి చట్టం కల్పించలేదు. గతంలో ఆర్వోఆర్‌ చట్టంలో ఫిర్యాదులపై విచారణ చేసే అధికారం తహసీల్దార్‌ స్థాయి నుంచి సీసీఎల్‌ఏ వరకు ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్యాయంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటూ ఎవరైనా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భూముల ధరలు బాగా పెరగడంతో అక్రమ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి.
  • మూడేళ్ల క్రితం నల్గొండ జిల్లా గుర్రంపోడు తహసీల్దార్‌/సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూ యజమాని ప్రత్యక్షంగా హాజరు కాకుండానే.. ఆధార్‌ కార్డు, సెల్‌ఫోన్‌ ఓటీపీ లాంటివేమీ లేకుండానే భూ లావాదేవీని రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. బాధితులు పసిగట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టారు.
  • సంగారెడ్డి జిల్లా కంకోల్‌కు చెందిన మడెప్ప అనే రైతుకు నాలుగు ఎకరాలు ఉండగా.. ఆయన ఖాతాలోకి ఆకస్మికంగా మరో రెండున్నర ఎకరాలు వచ్చిచేరాయి. తనది కాని భూమిని తొలగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండున్నర ఎకరాలను రైతు ఖాతా నుంచి తొలగించారు. దీంతోపాటు ఆయనకున్న నాలుగు ఎకరాలను కూడా వేరే రైతు పేరుపై మార్చేశారు.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలానికి చెందిన ఓ రైతు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆ రైతుకు తెలియకుండానే ఆయనకు బంధువయ్యే ఓ రైతు కొంత భూమిని వారసత్వ బదిలీ కింద తన పేరుపైకి మార్చేసుకున్నారు.

తిరిగి పరిశీలించే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి
- సునీల్‌కుమార్‌, భూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు

మన దేశంలో మొదటి నుంచీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ, భూముల రికార్డుల వ్యవస్థలు వేర్వేరుగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ కేవలం దస్తావేజుల రిజిస్ట్రేషన్‌, ఫీజులపై(స్టాంపుల చట్టం) దృష్టి పెడుతుంది. ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం భూముల హక్కులను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తుంది. భూదస్త్రాల్లో మార్పులు.. చేర్పులు చేస్తుంది. దీనికి భిన్నంగా తెలంగాణలో రెవెన్యూశాఖ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. ఆర్వోఆర్‌ ప్రకారం విచారణ చేపట్టడం లేదు. ఇది చాలా పెద్ద లోపం. దీన్ని సరిచేయాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని