గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం శివారులో చేపట్టిన న్యూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను మొగుళ్లపల్లి గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు.

Published : 21 Apr 2024 03:49 IST

మొగుళ్లపల్లి, న్యూస్‌టుడే: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం శివారులో చేపట్టిన న్యూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేను మొగుళ్లపల్లి గ్రామస్థులు శనివారం అడ్డుకున్నారు. జాతీయ రహదారుల సంస్థ మంచిర్యాల జిల్లా నర్వ గ్రామం నుంచి హనుమకొండ జిల్లా ఊరుగొండ వరకు ఈ రహదారిని నిర్మించనుంది. మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి, మేదరమెట్ల, ఇస్సిపేట, రంగాపూర్‌ గ్రామాల ద్వారా వెళ్తుండగా, తహసీల్దార్‌ సునీత ఆధ్వర్యంలో మండల అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేసి సర్వేను అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. జాతీయ రహదారికి ఎట్టిపరిస్థితుల్లో మా వ్యవసాయ భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. తాతల కాలం నుంచి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామని, ఇప్పుడు భూమిపోతే జీవనోపాధి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా నిర్మాణ పనులు చేపడితే కుటుంబమంతా పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. తహసీల్దార్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా రైతులు వినలేదు. చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని