దీర్ఘకాలిక తలనొప్పికి న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌తో చెక్‌

దీర్ఘకాలికంగా తలనొప్పి (మైగ్రేన్‌)తో బాధపడుతున్న మారిషస్‌కు చెందిన 24 ఏళ్ల మహిళకు అరుదైన చికిత్సతో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) వైద్యులు ఉపశమనం కల్పించారు.

Published : 21 Apr 2024 10:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: దీర్ఘకాలికంగా తలనొప్పి (మైగ్రేన్‌)తో బాధపడుతున్న మారిషస్‌కు చెందిన 24 ఏళ్ల మహిళకు అరుదైన చికిత్సతో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) వైద్యులు ఉపశమనం కల్పించారు. పేస్‌మేకర్‌ మాదిరి న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌ ద్వారా  చికిత్స అందించారు. శనివారం ఏఐజీ వైద్యులు మీడియాకు ఈ అంశంపై వివరించారు. పలు దేశాల్లో చికిత్స తీసుకున్నా ఆమెకు పూర్తిస్థాయిలో నయం కాలేదు. ఆమె ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి ఏఐజీ వైద్యులను సంప్రదించారు. ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ క్రానిక్‌ పెయిన్‌, న్యూరోమాడ్యులేషన్‌ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ చావలి, న్యూరో సర్జరీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ సుబోధ్‌ ఆమెను పరిశీలించారు. హై సర్వైకల్‌ స్పైనల్‌ కార్డ్‌ స్టిమ్యులేటర్‌ ఇంప్లాంటేషన్‌(న్యూరో స్టిమ్యులేటర్‌) ప్రక్రియతో చికిత్స చేయాలని నిర్ణయించారు.

శరీరంలో ఎక్కడ నొప్పి కలిగినా మెదడుకు సంకేతాలు అందుతాయి. అప్పుడే రోగికి నొప్పి తెలుస్తుంది. ఈ పరికరం ద్వారా నొప్పి సంకేతాలు మెదడుకు చేరుకోక ముందే అడ్డుకోవడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మహిళ నడుము కింది భాగంలో న్యూరో స్టిమ్యులేటర్‌ పరికరాన్ని అమర్చారు. దీనికి రెండు ఎలక్ట్రోడ్‌లను అనుసంధానం చేసి వాటిని వైర్ల ద్వారా మెదడుకు సంకేతాలు తీసుకెళ్లే మెడ భాగంలో ఉన్న నరాల జంక్షన్‌తో అనుసంధానం చేశారు. దీంతో ఆ మహిళకు ఉపశమనం కలిగింది. సాధారణంగా ఈ న్యూరో స్టిమ్యులేటర్‌ చికిత్సను కేవలం దీర్ఘకాలిక వెన్నునొప్పులు, డయాబెటిక్‌ న్యూరోపతి వల్ల కలిగే నొప్పులు, ప్రమాదంలో కాళ్లు పడిపోయిన రోగులకు వినియోగిస్తుంటారు. ఇలా దీర్ఘకాలిక తలనొప్పి(మైగ్రేన్‌) చికిత్స కోసం ఆసియాలోనే తొలిసారి దీనిని వినియోగించినట్లు డాక్టర్‌ సిద్ధార్థ్‌ చావలి వివరించారు. న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌ కోసం రూ.11లక్షలు-రూ.12 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు.


దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారికి శుభవార్త

 

పలువురు దీర్ఘకాలికంగా వివిధ రకాల నొప్పులతో జీవితాన్ని నిరుత్సాహంగా నెట్టుకొస్తుంటారు. వారికి న్యూరో స్టిమ్యులేటర్‌ ఇంప్లాంట్‌తో చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాంటి రోగులందరికీ ఇది గొప్ప శుభవార్తే. దీర్ఘకాలిక తలనొప్పి నివారణ కోసం ఆసియాలో తొలిసారి విజయవంతంగా ఇలాంటి చికిత్స అందించడం ద్వారా ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ, పరిష్కార మార్గాన్ని చూపడంలో మా అంకిత భావం మరోసారి స్పష్టమైంది.

డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్‌, ఏఐజీ ఆసుపత్రి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని