కొత్త వివరాల్లేని అదనపు ఛార్జిషీటును అనుమతించరాదు

ఒకసారి అభియోగపత్రం దాఖలుచేసిన తరువాత కొత్త వివరాలేమీ లేకుండా పోలీసులు దాఖలుచేసిన అదనపు ఛార్జిషీటును విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది.

Updated : 21 Apr 2024 05:40 IST

తీర్పు వెలువరించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఒకసారి అభియోగపత్రం దాఖలుచేసిన తరువాత కొత్త వివరాలేమీ లేకుండా పోలీసులు దాఖలుచేసిన అదనపు ఛార్జిషీటును విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగపరచడమేనని పేర్కొంది. ఇలాంటి అదనపు అభియోగపత్రాన్ని కింది కోర్టులు అనుమతించవద్దని పేర్కొంది. నిరాధారమైన అసంబద్ధ అరోపణలతో గృహహింస కేసు నమోదూ చేయరాదని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ ఇటీవల తీర్పును వెలువరించారు. వరకట్న వేధింపులపై ఫాతిమా హుస్నా ఫిర్యాదు మేరకు ఆమె భర్త దబీరుద్దీన్‌ ఖాజాతోపాటు అతని కుటుంబ సభ్యులపై సంజీవరెడ్డినగర్‌ పోలీసుస్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తుచేసిన పోలీసులు 13వ అదనపు సీఎంఎం కోర్టులో 2008లో అభియోగపత్రం దాఖలు చేశారు. అందులో ఆమె భర్తపై మాత్రమే కేసు నమోదుచేస్తూ అతని కుటుంబసభ్యులపై ప్రాథమిక ఆధారాల్లేవని పేర్కొన్నారు. రెండేళ్ల తరువాత తిరిగి దర్యాప్తుచేసి ఆమె భర్త కుటుంబసభ్యులను చేరుస్తూ పోలీసులు అదనపు ఛార్జిషీటు దాఖలుచేశారు. దీన్ని సవాల్‌చేస్తూ అదనపు అభియోగపత్రాన్ని కొట్టివేయాలంటూ ఫాతిమా మామ మహమ్మద్‌ అసీఫుద్దీన్‌, తదితరులు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ముద్దు విజయ్‌ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఇప్పటికే పిటిషనర్లపై ఎలాంటి ఆధారాల్లేవంటూ అభియోగపత్రం దాఖలు చేసిన రెండేళ్లకు, అదీగాక సౌదీలో ఉన్న ఆమె భర్త కుటుంబసభ్యులను నిందితులుగా చేరుస్తూ కొత్త వివరాలేమీ లేకుండా అదనపు ఛార్జిషీటు దాఖలుచేయడం చెల్లదన్నారు. కేసుపెట్టిన తరువాత ఫాతిమా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పెళ్లిని రద్దు చేసుకున్నాక ఆమె ఒత్తిడితో పోలీసులు అదనపు అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. పీపీ వాదనలు వినిపిస్తూ తాజాగా స్వతంత్ర సాక్షులను విచారించి అభియోగపత్రం దాఖలు చేశారన్నారు. ఫాతిమా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె తల్లిదండ్రులను అదనపు కట్నంతో పాటు రూ.20 లక్షల నగలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. పెళ్లి తరువాత ఆమె భర్తతోపాటు పిటిషనర్లు 13 రోజులు ఇంటిలో ఉన్నారని, అదనపు కట్నం కోసం హింసించారన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి రికార్డులన్నీ పరిశీలించిన తరువాత మొదట దాఖలుచేసిన అభియోగపత్రానికి భిన్నంగా ఎలాంటి కొత్త విషయాలు అదనపు ఛార్జిషీటులో కనిపించలేదన్నారు. కొత్తగా విచారించిన సాక్షులు ఫిర్యాదుదారు అయిన ఫాతిమా తల్లిదండ్రులేనని, వారు మొదట అభియోగపత్రం దాఖలు చేసినపుడు అందుబాటులో ఉన్నారని, అప్పట్లో ఎందుకు విచారించలేదో తెలియడం లేదన్నారు. వారుకూడా కొత్తగా వెల్లడించిన వివరాలు ఏవీ లేవన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. కొత్త విషయాలు లేకుండా దాఖలుచేసిన అదనపు అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు పిటిషనర్లయిన ఫాతిమా అత్తమామలు, ఆడపడుచులపై నమోదైన కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని