భూగర్భ జలసిరి.. ఆవిరి!

మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగు ఈ ఏడాది పూర్తిగా ఎండిపోయింది. వాగుపై ఉన్న చెక్‌డ్యాంలలో తడి కూడా లేదు.

Updated : 21 Apr 2024 05:36 IST

వానలు కురవక పడిపోయిన మట్టాలు
ఎండిపోతున్న వాగులు, వంకలు
వచ్చే రెండు నెలలూ మరింత కష్టం
న్యూస్‌టుడే, నర్సింహులపేట
ఈనాడు, హైదరాబాద్‌

మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగు ఈ ఏడాది పూర్తిగా ఎండిపోయింది. వాగుపై ఉన్న చెక్‌డ్యాంలలో తడి కూడా లేదు. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో ఆకేరు పరిసర ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బోర్లు ఎండిపోయి సాగునీటి సమస్య ఏర్పడింది. యాసంగి చివరిదశలో పంటలను తడిపేందుకు రైతులు వాగులో బోర్లు తవ్వి ఊట కోసం పాట్లు పడుతున్నారు. ఊట ఏర్పడగానే మోటార్లతో పంటలకు పెడుతున్నారు. రింగులతో బావులు ఏర్పాటు చేసుకుంటున్నారు. జనగామ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ వాగు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ అనంతరం మున్నేరులో కలుస్తుంది. వాగు పొడవునా నీటి కోసం తండ్లాట కనిపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలు వేగంగా ఆవిరవుతున్నాయి. వానలు ముఖం చాటేయడంతో జలమట్టం పడిపోగా.. ఉన్న నీటిని అవసరాలకు ఎడాపెడా తోడేస్తుండటంతో జల సిరి లోలోతుల్లోకి జారిపోతోంది. గత ఏడాది మార్చిలో రాష్ట్ర సగటు మట్టం 8.02 మీటర్లు ఉండగా ఈ ఏడాది మార్చిలో 9.69 మీటర్ల లోతుకు దిగజారింది. అంటే ఏడాది కాలంలో 1.67 మీటర్ల లోతుకు పడిపోయింది. సాగునీటి కాలువలు లేని చోట రైతులు పూర్తిగా బోర్లపైనే ఆధారపడుతున్నారు. వేసవి కావడంతో నీటి వినియోగం పెరిగింది. గృహ, వ్యక్తిగత అవసరాలు పెరగడంతో ప్రతి కుటుంబ సగటు వినియోగం 200 లీటర్ల వరకు పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో బోర్లలో మట్టం లోతుల్లోకి వెళ్తోంది.

వర్షపాతం తగ్గడంతోనే..

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గింది. 2023 జూన్‌ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో 876 మిల్లీ మీటర్ల వర్షపాతానికిగాను 920 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 10 నెలల సగటును తీసుకుంటే ఐదు శాతం ఎక్కువ కనిపిస్తున్నా నెలల వారీగా తగినంత వర్షం కురవలేదు. 11 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాల్లోని అనేక మండలాల్లో భూగర్భ జలాలు మీటర్లకొద్దీ దిగువకు పడిపోయాయి. మిగిలిన 21 జిల్లాల్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైనా.. సరైన రీతిలో కురవకపోవడం, వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు పడిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఏడు శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. అక్కడ గత ఏడాదితో పోల్చితే ఈ మార్చిలో భూగర్భ జలమట్టంలో 0.32 మీటర్ల స్వల్ప పెరుగుదల నమోదైంది.

ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ప్రభావం

రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మిషన్‌ భగీరథ సరఫరాపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. పశువులు, ఇంటి అవసరాలకు మాత్రం బోర్ల నీరు వినియోగిస్తున్నారు. పంటలు చివరిదశలో ఉన్న ప్రస్తుత తరుణంలో బోర్ల నుంచి వీలైనంత వరకు తోడేందుకు రైతులు శ్రమిస్తున్నారు. ఈ కారణంగా ఏప్రిల్‌ నెలలో భూగర్భ జల మట్టం మరింత లోతుకు పడిపోయే ప్రమాదముంది. వినియోగానికి తగినట్లు వర్షాలు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో మే నెలలో గరిష్ఠ స్థాయికి మట్టం పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, జనగామ, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో వాగులు, వంకలు ఇప్పటికే అడుగంటిపోయాయి. ఈ జిల్లాల్లో గొర్రెలు, మేకలకు తాగునీటి తావులు కూడా లేకుండా పోతున్నాయని కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు