బియ్యం బకాయిలున్నా.. మళ్లీమళ్లీ ధాన్యం!

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్‌లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ - సీఎంఆర్‌) అప్పగించాలి.

Published : 22 Apr 2024 03:06 IST

కొందరు మిల్లర్లకు ప్రత్యేక కేటాయింపులు
రూ. వందల కోట్ల మేర సీఎంఆర్‌ బకాయిలు
రైస్‌ మిల్లుల్లో నాలుగో వంతు లీజుదారుల చేతుల్లోనే..
విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్‌లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ - సీఎంఆర్‌) అప్పగించాలి. ఎవరైనా చివరి గడువు తర్వాత కూడా ఇవ్వకపోతే తర్వాత సీజన్‌లో ఆ మిల్లరుకు ధాన్యం కేటాయింపులు ఆపేయాలి. కానీ అధికారులతో అవగాహన ఉన్న, రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు మిల్లర్లకు ఆ తర్వాత కూడా రెండు మూడేళ్ల పాటు ధాన్యం కేటాయింపులు జరిగాయి. గత మూడేళ్లలో రాష్ట్రంలోని పలుచోట్ల ఇదే పరిస్థితి. దీంతో ఆయాచోట్ల ఒక్కో మిల్లరు నుంచి రూ.పదుల కోట్ల విలువైన సీఎంఆర్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఎట్టకేలకు ఈ అక్రమాలపై పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించడం, విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు చేస్తుండటంతో ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. కేసులు పెడుతుండటంతో కొందరు మిల్లు యజమానులు విదేశాలకు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్నిచోట్ల మిల్లుల్ని లీజుదారులే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బకాయిపడిన రూ.వందల కోట్ల సీఎంఆర్‌ వసూలు చేయడం పౌరసరఫరాల సంస్థకు సవాలుగా మారింది.

వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నారు..!

రైస్‌మిల్లు ఉంటే చాలు.. ధాన్యం వస్తుంది. మర ఆడించి బియ్యాన్ని ఇస్తే ఆ ఛార్జీలతో పాటు పొట్టు, తవుడు కూడా మిల్లరుకే వెళుతుంది. అయితే మిల్లర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటిని తర్వాత సీజన్‌లో వచ్చే వడ్లతో తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు చిన్న చిన్న రైస్‌మిల్లులను అద్దెకు తీసుకుని.. పైరవీలతో ఎక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 2,600 రైస్‌ మిల్లులు ఉంటే.. ఇందులో 25% వరకూ లీజుదారుల చేతుల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

వసూలు ఎలా?

ఓ జిల్లాలో భారీ సీఎంఆర్‌ బకాయిలున్న మిల్లరును పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. మరో భాగస్వామి దుబాయ్‌ పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టేది లేదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. అతణ్ని పట్టుకురావడం ఓ సవాలు అయితే.. ఆ మిల్లరు చెల్లిస్తే గానీ సీఎంఆర్‌ బకాయిలు వచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా మిల్లర్లకు ధాన్యం ఇస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లాల్లోనే మిల్లర్లు రూ.300 కోట్ల మేర సీఎంఆర్‌ బకాయిలు ఉన్నారు. ఇటీవల ఆరుగురు మిల్లర్లపై కేసులు పెట్టారు. మెదక్‌ జిల్లాలో ఏడుగురు మిల్లర్లపై కేసులు పెట్టి యజమానుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.114 కోట్ల మేర సీఎంఆర్‌ బకాయిలు రావాల్సి ఉంది.


దిద్దుబాటు చర్యలు..

నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కేటాయింపులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. మెదక్‌ జిల్లాలో 172 రైస్‌ మిల్లులు ఉన్నాయి. దాంతో 2023-24లో 111 మిల్లులకే ధాన్యం కేటాయిస్తున్నారు. ‘‘2021-22, 2022-23 సంవత్సరాల్లో బకాయిల విషయంపై అవగాహన లేక కొన్ని మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయించిన విషయం వాస్తవమే. గత సెప్టెంబరులో నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించా. అక్టోబరులో పలు మిల్లుల నుంచి దాదాపు 9 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నాం’’ అని మెదక్‌ జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని