ప్రశ్నిస్తే వ్యవస్థలతో దాడులు

ప్రభుత్వ బాధ్యతలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ అన్నారు.

Updated : 22 Apr 2024 05:38 IST

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బాధ్యతలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ అన్నారు. ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులనే జైలు పాల్జేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించినా తాము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొనడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారంలో ప్రతిపక్షాల ఖాతాలనే సీజ్‌ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో తెలంగాణ పీపుల్స్‌ జేఏసీ, భారత్‌ జోడో అభియాన్‌ నిర్వహించిన ‘2024ఎన్నికలు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘భావప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. అయితే కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే సీఎంలపైనా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతాయి. పెద్ద కంపెనీలు రూ.వేల కోట్లను బాండ్ల రూపంలో భాజపాకు ఇస్తే మాత్రం దాడులు ఉండవు. రూ.8 వేల కోట్లు ఇస్తే ఆ కంపెనీలకు రూ.8 లక్షలకోట్ల కాంట్రాక్టు దక్కుతుంది. అలాంటి కంపెనీలపై మనీలాండరింగ్‌ చట్టం కింద కేసులు ఉండవు. ఎన్నికల బాండ్లు అవినీతి తప్ప మరోటి కాదు. వాటిల్లో 50% అధికారంలోని భాజపాకు వెళితే, మిగిలినవి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర పార్టీలకు వెళ్లాయి. ఆరేళ్లలో రూ.16 వేలకోట్లు భాజపాకు చేరాయి.

ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఇందులో అధికార దుర్వినియోగం జరుగుతోంది. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చేతిలో పావు వంటిదే. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ విఫలమైంది’’ అని అన్నారు. దేశంలో 50% సంపద 9 కుటుంబాల చేతిలోనే ఉందని, ఎక్కువ మంది పేదరికంలోనే మగ్గుతున్నారని సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్‌ పేర్కొన్నారు. ‘‘ఉపా వంటి క్రూరచట్టాలను వినియోగించి.. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం నొక్కేస్తోంది. వ్యవస్థలను పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తున్నారు. సమాచార హక్కును రెండుసార్లు సవరించారు. వ్యక్తిగత వివరాలు అడగరాదన్న సవరణలు చట్టాన్ని దెబ్బతీశాయి. మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో గ్రూపునకు చెందిన శరత్‌చంద్రారెడ్డి రూ.5 కోట్లు ఎన్నికల బాండ్లుగా చెల్లించిన వెంటనే బెయిలు వచ్చింది. తరువాత అప్రూవర్‌గా మారారు. ఆయన వాంగ్మూలం మీద సీఎంని అరెస్ట్‌ చేశారు. తరువాత మరో రూ.25 కోట్లు బాండ్ల రూపంలో భాజపాకు వెళ్లాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని