ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు

లోక్‌సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) దళాలను మోహరించనున్నారు.

Published : 22 Apr 2024 03:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) దళాలను మోహరించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న సుమారు 60 వేల మంది స్థానిక పోలీసులకు తోడు 150-160 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలు విధుల్లో పాల్గొననున్నాయి. అస్సాం రైఫిల్స్‌(ఏఆర్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్‌), సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ), ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) బలగాలతో కూడిన ఒక్కో కంపెనీలో 70-80 మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి సుమారు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపారు. వీటిని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ యూనిట్లకు పంపించారు. యూనిట్ల వారీగా ఏర్పాటు చేసిన అంతర్గత చెక్‌పోస్టులతో పాటు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వీరు తనిఖీ విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లేఖ రాసింది. రెండో, మూడో విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయిన అనంతరం మే నెల మొదటి వారంలో ఆ బలగాలు తెలంగాణకు రానున్నట్లు పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వాటిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా మోహరించే అవకాశముంది. గతంతో పోల్చితే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేకపోయినా.. ఇటీవలి కాలంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పాటు ఎన్‌కౌంటర్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల అలజడులకు ఆస్కారం ఉండవచ్చనే అనుమానంతో సరిహద్దుల్లో నిఘా పెంచారు. స్థానిక పోలీసులు బందోబస్తులో నిమగ్నం కావడంతో పాటు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌ కూంబింగ్‌ కొనసాగుతోంది. మే నెల మొదటి వారంలో వచ్చే కేంద్ర బలగాల్లో ఎక్కువ మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని