నాలుగేళ్ల కనిష్ఠానికి శ్రీరామసాగర్‌

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిమట్టం నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.

Published : 22 Apr 2024 03:09 IST

ప్రస్తుతం ప్రాజెక్టులో మిగిలింది 10.686 టీఎంసీలే
అందులో 3 టీఎంసీలు మిషన్‌ భగీరథకు
మరో 3 టీఎంసీలు ఎండకు ఆవిరయ్యే అవకాశం

శ్రీరామసాగర్‌, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిమట్టం నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. వర్షాలు క్రమ పద్ధతిలో కురవకపోవడం, ఎగువ నుంచి తగినంత వరద రాకపోవడంతో ప్రస్తుతం వట్టిపోతోంది. జలాశయంలో సాధారణంగా ఏప్రిల్‌ మాసంలో 20 టీఎంసీలకుపైనే నీటిమట్టం ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 10.686 టీఎంసీలకు పడిపోయింది. ఫలితంగా ప్రాజెక్టులో కొంత భాగం మైదానాన్ని తలపిస్తోంది.

జులైలోనే నిండినా...

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలు. గతేడాది వానాకాలం ప్రారంభంలో భారీ వర్షాలు కురవడంతో జులైలోనే నిండింది. మిగులు జలాలు సైతం గోదావరిలోకి విడుదల చేశారు. కానీ తరువాత నెలల్లో ఆశించినంత వర్షాలు కురవకపోవడంతోపాటు ఏటా అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వరద స్వల్పంగానే వచ్చింది. దీంతో వానాకాలం పంటలకు నీటి విడుదల ముగిసే నాటికే ప్రాజెక్టులో నిల్వలు తగ్గాయి. ఇక యాసంగి పంటలకు విడుదల చేసే నాటికి మరింత అడుగుకు చేరాయి. వానాకాలం, యాసంగిల్లో జలాశయం నుంచి కాకతీయ కాల్వకు 78.445 టీఎంసీలు, సరస్వతి కాల్వకు 7.882, లక్ష్మికాల్వ 3.339, ఎస్కేప్‌ గేట్లు 12.076, వరదకాల్వ 25.055, గుత్ప ఎత్తిపోతల 2.946, అలీసాగర్‌ ఎత్తిపోతల 4.569, టీఎస్‌ ఐడీసీ ఎత్తిపోతల 2.782, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి కోసం 4.672 టీఎంసీలు విడుదల చేశారు. ‘ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 10.686 టీఎంసీల్లో నుంచి 3 టీఎంసీలు ఉమ్మడి నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల తాగునీటి అవసరాల కోసం మిషన్‌ భగీరథ ద్వారా జులై నెలాఖరు వరకు అందించనున్నాం’ అని ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. మరో 2.5-3 టీఎంసీలు ఆవిరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్‌, జులైల్లో మంచి వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టు తిరిగి జీవం పోసుకోవడంతోపాటు సాగుకు ఢోకా ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని