రూ.కోటి చొప్పున తెప్పించి ఎక్కడికి పంపారు..?

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది.

Published : 22 Apr 2024 09:08 IST

విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు
రాణిగంజ్‌, అఫ్జల్‌గంజ్‌లలో ఎస్సైకి డబ్బులిచ్చింది ఎవరని ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగా.. తాజాగా విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకొంది. దర్యాప్తు క్రమంలో టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లో దొంగచాటుగా సొమ్ము తరలింపు అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయన్ను విచారించారు.

ఎస్సై వాంగ్మూలం ఆధారంగా..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు సూచనలతో టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై ఒకరు రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి సికింద్రాబాద్‌, మలక్‌పేటల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో దివ్యచరణ్‌రావుకు అప్పగించినట్లు ఇది వరకు దర్యాప్తులోనే వెల్లడైంది. సదరు ఎస్సై సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తాజాగా దివ్యచరణ్‌రావును విచారించారు. మూడుసార్లు ఆయన్ను పిలిచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఎస్సైని రాణిగంజ్‌, అఫ్జల్‌గంజ్‌లకు పంపి ఎవరి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకున్నారు..? ఆ తెచ్చిన సొమ్మును మళ్లీ ఎక్కడికి పంపించారు..? అందుకు ఆదేశాలిచ్చింది ఎవరు..? ఈ వ్యవహారమంతా గతేడాది అక్టోబరులో జరిగినందున శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులకు సమకూర్చారా..? అని ఆరా తీసినట్లు సమాచారం. అసలు రాధాకిషన్‌రావు ఈ పనికి దివ్యచరణ్‌రావునే ఎందుకు ఎంచుకున్నారనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. అయితే ఆయన నుంచి సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో మళ్లీ విచారణకు రావాలని సూచించి పంపించినట్లు సమాచారం.


హవాలా కోణంలో కేసు నమోదుకు అవకాశం

ప్రస్తుతం దర్యాప్తు బృందం దృష్టంతా ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం, ఫోన్‌ ట్యాపింగ్‌పైనే కేంద్రీకృతమైంది. డబ్బు తరలింపు అంశం గురించి అంతగా శ్రద్ధ పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే రాణిగంజ్‌, అఫ్జల్‌గంజ్‌లలో డబ్బులు సమకూర్చిన వారిని కనిపెట్టడంతోపాటు దివ్యచరణ్‌రావు ఆ సొమ్మును ఎవరికి అప్పగించారని తెలుసుకోవడం కేసులో కీలకాంశమైంది. ఈ క్రమంలోనే హవాలా కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని