వరంగల్‌ విమానాశ్రయంపై కదలిక.. ప్రాథమిక సర్వేకు ఏఏఐ కసరత్తు

వరంగల్‌ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) కసరత్తు చేపట్టింది.

Updated : 22 Apr 2024 08:43 IST

గతేడాది 253 ఎకరాల భూ కేటాయింపు
ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించాయి.  

మొత్తం ఆరు చోట్ల ప్రతిపాదన..

రాష్ట్రంలో ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరింది. మామునూరు(వరంగల్‌), ఆదిలాబాద్‌, బసంత్‌నగర్‌(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), కొత్తగూడెం, గుడిబండ(మహబూబ్‌నగర్‌)లను ప్రతిపాదించింది. ఆ మేరకు 2019లో ఏఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి ఆరింటి నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. అనంతరం ఇది దస్త్రాలకే పరిమితమైంది. వరంగల్‌ను తొలుత చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం తరువాత నిర్ణయించింది. ప్రస్తుతం వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ పరిధిలో 706 ఎకరాలు ఉంది. ప్రాంతీయ విమానాశ్రయంగా తొలిదశ అభివృద్ధికి కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ పేర్కొంది. అందులో భాగంగా 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జీఎమ్మార్‌ విమానాశ్రయంతోపాటు రక్షణ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దశాబ్దాల కిందటే వరంగల్‌లో ఎయిర్‌ ఫీల్డును నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అథారిటీ పైలట్ల శిక్షణ కోసం దాన్ని వినియోగిస్తున్నారు. ఇటీవల ప్రధాని పర్యటన సందర్భంగా ఆ ఎయిర్‌ ఫీల్డునే అధికారులు ఉపయోగించారు. ఇది శంషాబాద్‌లోని జీఎమ్మార్‌ విమానాశ్రయానికి 145 కిలోమీటర్ల వైమానిక దూరంలో ఉంది. విజయవాడ సమీపంలోని గన్నవరానికి 200, నాగ్‌పుర్‌కు 357, విశాఖపట్నంకు 385 కిలోమీటర్ల దూరంలో ఉంది. జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం సందర్భంగా 150 కిలోమీటర్ల పరిధిలో మరోటి అభివృద్ధి చేయకూడదన్న నిబంధన ఉండటంతో ముందస్తు అనుమతి అనివార్యమైంది.


కొత్త ప్రభుత్వ వైఖరి ఏంటో?

భూ కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల నేపథ్యంలో ఏఏఐ ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహం ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల తరువాత దీనిపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని