ఉచితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రజలకు ఉచితాలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Published : 22 Apr 2024 03:56 IST

లాభనష్టాలపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత
సమగ్ర చర్చ అవసరం: దువ్వూరి

హైదరాబాద్‌: ప్రజలకు ఉచితాలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఉచితాల విషయంలో రాజకీయ పార్టీలను ఎలా నిలువరించాలనేదానిపై సమగ్ర చర్చ జరగాలన్నారు. పడే భారం, కలిగే లాభం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇటీవల పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ‘‘..ఉచితాల అంశం రాజకీయపరమైనదిగా భావిస్తాను. అందువల్ల రాజకీయ ఏకాభిప్రాయం కుదరాలి. ఈ చొరవను కేంద్ర సర్కారు, ప్రధానమంత్రి తీసుకోవాలి. భారత్‌ వంటి పేద దేశంలో అత్యంత బలహీనవర్గాలకు కొన్ని రక్షణలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాటిని ఎంతవరకు విస్తరించవచ్చనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబ్బును సరిగ్గానే ఖర్చు పెడుతున్నామా, ఇంకా మెరుగ్గా ఏమైనా చేయవచ్చా అనేది తెలుసుకోవాలి’’ అని తెలిపారు.

‘ద్రవ్య బాధ్యత- బడ్జెట్‌ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులను కొన్ని రాష్ట్రాలు అతిక్రమిస్తుండటంపై దువ్వూరి మాట్లాడుతూ- రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే ఏటా 7.6 శాతం వృద్ధిరేటు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనావంటి కొన్ని దేశాలు దీన్ని సాధించగలిగాయన్నారు. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాలు వంటి సవాళ్ల మధ్య భారత్‌ దాన్ని ఎంతవరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు. ‘‘చట్టబద్ధ పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్ఠ సంస్థలు.. అనేవి అభివృద్ధి చెందిన దేశానికి నాలుగు స్తంభాల్లాంటివి. ఈ నాలుగు మనకు లేవని చెప్పలేం. అదే సమయంలో అవన్నీ ఉన్నాయనీ అనుకోలేని పరిస్థితి. వాటిని మరింత పటిష్ఠపర్చాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు