సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం

కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.

Published : 23 Apr 2024 05:14 IST

ఆ నీటిని ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో చేర్చండి
కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణనీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా..బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌తో సోమవారం ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. టెయిల్‌పాండ్‌ గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు ఆ రాష్ట్రం నీటిని విడుదల చేసుకుందని పేర్కొన్నారు. సాగర్‌ నుంచి ఆ రాష్ట్ర కోటా కింద విడుదల చేస్తున్న నీటి వాటా 5.5 టీఎంసీలలో ఈ 4 టీఎంసీలను మినహాయించాలని కోరారు. దీనిపై లిఖితపూర్వకంగానూ తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి అవసరాల కోసం బోర్డు చేసిన కేటాయింపులను మించి ఆ రాష్ట్రం తరలిస్తోందని, కృష్ణా బేసిన్‌ ఆవలి అవసరాలకూ నీటిని మళ్లిస్తున్న అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోరారు. బోర్డు ఛైర్మన్‌ స్పందిస్తూ..తెలంగాణ కూడా కేటాయింపుల కన్నా అధికంగానే వినియోగించిందని, ఇటీవల రెండు టీఎంసీల జలాలను సాగర్‌ నుంచి తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. కాగా తెలంగాణ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు స్పందించింది.దీనిపై సోమవారం సాయంత్రం ఏపీకి లేఖ రాసింది. టెయిల్‌పాండ్‌లో నిల్వ ఉంచిన నీటిని ఏపీ తరలించుకోవడం సరైన చర్య కాదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.  బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించేందుకు సోమవారం కృష్ణా బోర్డు ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైకోర్టులో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి తెలంగాణ హాజరుకాలేదు. అయితే ఛైర్మన్‌తో మాట్లాడిన సమయంలో బోర్డుకు సుమారు రూ.3 కోట్ల వరకు నిధులు కేటాయించేందుకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. బోర్డుకు చెల్లించాల్సిన బకాయిలు, 2024-25 ఆర్థిక సంవత్సరం కేటాయింపులపై చర్చించారు. నిధుల కేటాయింపునకు ఏపీ సానుకూలంగా ఉందని ఈఎన్సీ పేర్కొన్నట్లు తెలిసింది.


26 వరకు నీటిని తీసుకుంటామన్న ఏపీ

నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా నీటి విడుదలను ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగిస్తామని టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ ఈఎన్సీ బోర్డు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం 5.5 టీఎంసీల విడుదల కొనసాగుతుండగా, గతంలో మిగిలి ఉన్న 2.5 టీఎంసీలను కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని