కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు

పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి.

Published : 24 Apr 2024 05:43 IST

పెద్దపల్లి జిల్లా ఓడేడ్‌ వద్ద ఘటన
8 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం

ఈనాడు, పెద్దపల్లి, హైదరాబాద్‌; ముత్తారం, టేకుమట్ల, న్యూస్‌టుడే: పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. మొత్తం 23 పియర్లు నిర్మించగా ఓడేడ్‌ వైపు నుంచి రెండు, మూడో నంబరు పియర్ల మధ్యలో మూడు గడ్డర్లు కూలిపోయాయి. మరో రెండు పక్కకు ఒరిగాయి. వంతెన పక్కనే వాగులో రెండు గ్రామాల మధ్య రాకపోకల కోసం తాత్కాలిక రహదారి వేశారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటుచేసుకోగా, ఆ దారిపై జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై దాదాపు 500 మీటర్ల దూరం వంతెన నిర్మాణానికి ఎనిమిదేళ్ల కిందట నిధులు మంజూరయ్యాయి. 2016 ఆగస్టు 4న వంతెన నిర్మాణానికి అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. గుత్తేదారు దాదాపు ఏడాదిన్నర కిందట పనులను వదిలేశారు. తర్వాత వరదలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మూడు గడ్డర్లు నేలకూలాయి. కొంతమేర పక్కనున్న తాత్కాలిక రహదారిపై పడడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ద్విచక్రవాహనాలు మాత్రమే ఆ మార్గంలో వెళ్లేందుకు వీలుంది. భారీ వాహనాలు మంథని, పెద్దపల్లి మీదుగా వెళ్తున్నాయి.

ఈదురు గాలులకో.. వరద తాకిడికో విచారణలో తేలుతుంది: ఈఈ

గడ్డర్లు కూలిన ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రహదారులు, భవనాల శాఖ పెద్దపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాములు ‘ఈనాడు’కు తెలిపారు. గడ్డర్లు సోమవారం వచ్చిన ఈదురు గాలులకు కూలిపోయాయా? లేక గతంలో వచ్చిన వరద తాకిడికా అన్నది విచారణలో తేలుతుందన్నారు. గుత్తేదారు రూ.18 కోట్ల విలువైన 40 శాతం మేర పనులు మాత్రమే చేశారన్నారు.

టెండరు రద్దు, ధరావతు సొమ్మును జప్తు: సీఈ మోహన్‌నాయక్‌

గుత్తేదారు పనులు కొనసాగించని కారణంగా మానేరు వాగుపై హైలెవల్‌ వంతెన టెండరును రద్దు చేసి, ధరావతు సొమ్మును జప్తు చేసినట్లు రహదారులు, భవనాల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ జె.మోహన్‌నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ వంతెన నిర్మాణానికి 2016లో రూ. 51.60 కోట్లతో అప్పటి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. 18 నెలల్లో పూర్తి చేసే విధంగా అదే సంవత్సరంలో మే నెలలో గుత్తేదారు సంస్థ సాయి కన్‌స్ట్రక్షన్స్‌తో ఒప్పందం చేసుకుంది. పూర్తి చేసేందుకు మూడు దఫాలు గడువు పొడిగించినా పనులు చేపట్టేందుకు గుత్తేదారు ముందుకు రాకపోవటంతో ఈ ఏడాది జనవరిలో టెండరు రద్దు చేశాం.ధరావతు కింద గుత్తేదారు చెల్లించిన రూ.1.16 కోట్లను జప్తు చేశాం. చేసిన పనులకు ప్రభుత్వం రూ.65.05 లక్షలు చెల్లించాల్సి ఉండగా వాటిని చెల్లించలేదు. రూ.40.86 కోట్లతో మిగిలిన పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని