తాగునీటికి.. మూసీ శుద్ధికి

ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్‌కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు.

Published : 24 Apr 2024 05:43 IST

కొండపోచమ్మ నుంచి భాగ్యనగరానికి 15 టీఎంసీల అదనపు జలాల తరలింపునకు ప్రణాళిక
మహా నగర అవసరాలకు 10.. మూసీ ప్రక్షాళనకు 5 టీఎంసీలు
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,800 కోట్లు
సీఎం రేవంత్‌రెడ్డి ఆమోద ముద్ర!
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్‌కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. రూ.4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోద ముద్ర వేశారు. హడ్కో ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించారు. దీనికి హడ్కో దాదాపు ఆమోద ముద్ర వేయబోతోందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాలకు ప్రతి రోజూ 570 మిలియన్‌ గ్యాలన్ల(ఎంజీడీ) నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు ఈ నీటి సరఫరా సరిపోతున్నా 2050 నాటికి రోజూ దాదాపు వెయ్యి ఎంజీడీల నీరు అవసరమవుతుందని అంచనా వేశారు. మహా నగరం విస్తరిస్తుండటంతో ఇప్పటి నుంచి గోదావరి, కృష్ణా నదుల నుంచి అదనంగా నీటిని రాజధానికి తరలించగలిగితేనే రాబోయే అవసరాలు తీరతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సర్కారు ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి పైపులైను ద్వారా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదావరి రెండో దశ కింద నీటిని నగరానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకు 82 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మిస్తారు. ఈ పైపులైనుతో ఏటా పది టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు, మరో అయిదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనకు వినియోగించాలని నిర్ణయించారు. ఈ పైపులైను ద్వారా నీటిని ఘన్‌పూర్‌ వద్ద నిర్మించే మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పంపు హౌస్‌, నీటిశుద్ధి కేంద్రం దగ్గరకు తెస్తారు. జన్వాడ వద్ద మరో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇలా ప్రతిరోజూ 170 ఎంజీడీల నీటిని శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తారు. కొండపోచమ్మ నుంచి తెచ్చే నీటిలో కొంత భాగాన్ని నగరానికి చుట్టూ ఉన్న అతి పెద్ద చెరువుల్లో కూడా నింపాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఇలా పది టీఎంసీల నీటిని నగర తాగునీటి అవసరాలకు, చెరువులు నింపడానికి వినియోగిస్తారు. ఐదు టీఎంసీల నీటిని నేరుగా పైపులైన్‌ ద్వారా తెచ్చి జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌(గండిపేట), హిమాయత్‌సాగర్‌లో నింపుతారు.

హడ్కోతో చర్చలు...

రూ.50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలని నిపుణులు సూచించారు. కొండపోచమ్మ నుంచి జంట జలాశయాలకు వచ్చే ఈ అయిదు టీఎంసీల నీటిలో అవసరమైన మేరకు ప్రతి రోజూ మూసీలోకి పంపి నదిని శుభ్రం చేసే కార్యక్రమం చేపడతారని పురపాలక శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.4,800 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుపై ఎన్నికల షెడ్యూల్‌ రాకముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖ అధికారులతో చర్చించారు. నగరానికి ఇదో ముఖ్యమైన ప్రాజెక్టు అవుతుంది కాబట్టి వెంటనే నిర్మాణ కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. నిధుల సమీకరణలో భాగంగా హడ్కోతో చర్చలు జరపనున్నారు. హడ్కో దీనికి నిధులు మంజూరుచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఈ ప్రాజెక్టు అమలుపై కీలకమైన ఆదేశాలు వెలువడతాయని తెలుస్తోంది.

ప్రత్యేక భూసేకరణ అవసరం లేకుండా..

గోదావరి ఫేజ్‌-1 వరకు రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల కోసం పలు ప్రాంతాల్లో జలమండలి అప్పట్లో భూములు సేకరించింది. ఫేజ్‌-1, 2 ప్రాజెక్టులకు సరిపోయేంత భూమి అందుబాటులో ఉంది. పైపులైన్ల కోసం కూడా పెద్దగా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని సేకరించి శుద్ధి చేసి మూడు విడతల్లో పంపింగ్‌ చేసి నగరానికి తరలిస్తున్నారు. ఫేజ్‌-1 వరకు అప్పట్లో రూ.3,500 కోట్ల నుంచి రూ.3,800 కోట్ల వరకు ఖర్చుచేశారు. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుకు పెద్దగా భూములను సేకరించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని