నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ

కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్‌ విచారణ ప్రారంభం కానుంది.

Published : 24 Apr 2024 03:43 IST

హైదరాబాద్‌కు రానున్న కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌
27 వరకు విచారణ.. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్‌ విచారణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 14న జీవో ఎంఎస్‌.6తో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్నారు. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవనంలోని ఎనిమిదో అంతస్తు డి-బ్లాక్‌లో కమిషన్‌కు కార్యాలయాన్ని కేటాయించారు. నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ అనిల్‌కుమార్‌, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌ మంగళవారం బీఆర్కేఆర్‌ భవన్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటును పర్యవేక్షించారు. సాధారణ పరిపాలనశాఖ ఆధ్వర్యంలో కమిషన్‌కు ప్రోటోకాల్‌ ఏర్పాట్లు, ఎస్కార్ట్‌ను సమకూర్చారు.

నాలుగు రోజుల పర్యటన

కోల్‌కతాలో నివసిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటు అనంతరం తొలిసారి వస్తున్నారు. 24 నుంచి 27వ తేదీ వరకు ఆయన విచారణ చేపట్టనున్నారు. ఒకరోజు మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. కమిషన్‌ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్లు, స్టెనో, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లను నియమించారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన సిబ్బందిని కమిషన్‌ ఛైర్మన్‌ నియమించుకోనున్నారు. ఈ పర్యటనలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ సతీమణి కూడా నగరానికి వస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని