రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు

వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.

Published : 24 Apr 2024 03:43 IST

వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌పై ఈడీ చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీఎంసీ సంస్థకు 2009-12 మధ్య పలు బ్యాంక్‌లు కన్సార్షియంగా ఏర్పడి రూ.1673.52 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయి. ఆ తర్వాత 2013లో వీఎంసీ సంస్థ నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరిపోయింది. అప్పటికి వడ్డీలతో కలిపి రుణాలు రూ.1745.45 కోట్లకు చేరాయి. ఈ రుణాల ఎగవేతపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. వీఎంసీకి చెందిన హిమబిందు, వి.సతీశ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో నిధులను వేర్వేరు ఖాతాల్లోకి దారి మళ్లించినట్లు గుర్తించాయి. ఈ కేసులో ప్రస్తుతం ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో జూబ్లీహిల్స్‌లోని సతీశ్‌ ఇల్లు, ఆయన బినామీ అయిన కె.రాజేష్‌ పేరుమీద రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఉన్న వ్యవసాయ భూమి, అస్సాంలోని కొచ్చర్‌ జిల్లాలో ఎమ్మెల్‌ ఇన్‌ఫ్రా ప్రాపర్టీస్‌ (ఇండియా) లిమిటెడ్‌ పేరుతో ఉన్న రూ.11.73 కోట్ల విలువైన 580.77 ఎకరాల టీఎస్టేట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి వీఎంసీకి రావాల్సిన రూ.37.03 కోట్ల బకాయిలు ఉన్నాయి. సతీశ్‌కుమార్‌, హిమబిందు సోదరి మాధవిలు అమెరికాలోనూ పన్ను ఎగవేత, వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డట్లు అక్కడి న్యాయస్థానం నిగ్గు తేల్చిందని ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని