రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో పేలుడు

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బాబురావు అభిప్రాయపడ్డారు.

Published : 24 Apr 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ బాబురావు అభిప్రాయపడ్డారు. ఆ పరిశ్రమలో రక్షణ చర్యలు చేపట్టడంలో యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమలో ఉపయోగించే ప్రమాదకర రసాయనాలు అమ్మోనియం నైట్రేట్‌, గ్వానిడైన్‌ నైట్రేట్‌ విషయంలో తగు జాగ్రత్తలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఎస్‌బీ ఆర్గానిక్స్‌ పేలుడుతో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. కంపెనీలో సురక్షితమైన ఆపరేటింగ్‌ విధానాలు లేకపోతే పేలుడుకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలో రియాక్టర్‌ కూలింగ్‌ ప్రక్రియలో ఆయిల్‌ సర్క్యులేషన్‌ పంప్‌ ట్రిప్‌ అవ్వడం, స్టాండ్‌బై పంప్‌ లేకపోవడంతో ఆయిల్‌ లీక్‌ అయి పేలుడు జరిగినట్లు ఓ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ఇచ్చింది. కంపెనీలో అమ్మోనియం నైట్రేట్‌, యూరియా లు గ్వానిడైన్‌ నైట్రేట్‌ తయారీకి వాడుతున్నట్లు వెల్లడైందని, దీనికి కంపెనీ ఎలాంటి అనుమతి పొందలేదని పేర్కొన్నారు. కంపెనీలో సేఫ్టీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు కన్పించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు