బోన్‌మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ

ఓ రకమైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది.

Updated : 24 Apr 2024 08:48 IST

రూ.25 లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందించిన ఎంఎన్‌జే ఆసుపత్రి

ఈనాడు, హైదరాబాద్‌: ఓ రకమైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. దాదాపు రూ.25 లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందించింది. నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ పేద కుటుంబంలోని 18 ఏళ్ల షెహనాజ్‌.. క్లాసికల్‌ హాడ్కిన్స్‌ లింఫోమా (ఒక రకమైన రక్త క్యాన్సర్‌)తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఒక ట్రస్టు ఆసుపత్రి వైద్యుల సూచనతో నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కీమో, రేడియేషన్‌ ఇతర చికిత్సల కోసం దాదాపు రూ.20 లక్షల వరకు తల్లిదండ్రులు ఖర్చు చేశారు. ఇందుకోసం వారికి ఉన్న ఇంటిని అమ్మేశారు. తదుపరి చికిత్సకు వారి వద్ద డబ్బులు లేకపోవడంతో కార్పొరేట్‌ ఆసుపత్రి చేతులు ఎత్తేసింది. ఈ క్రమంలో చివరి ప్రయత్నంగా షెహనాజ్‌ను తల్లిదండ్రులు రెడ్‌హిల్స్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువకుడి పరిస్థితిని చూసిన అక్కడి వైద్యులు బోన్‌మ్యారో మార్పిడి చికిత్సతో ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని భరోసా ఇచ్చి, ఆటో లోగస్‌ ప్రక్రియలో చికిత్స ప్రారంభించారు. ఇందులో రోగి ఎముక మజ్జ నుంచి సేకరించిన కణాలను ల్యాబ్‌లో ఆరోగ్యకరమైన మూలకణాలుగా మార్పిడి చేసి తిరిగి రోగికి ఎక్కిస్తారు. అనంతరం ఆరోగ్యకరమైన రక్త కణాలు శరీరంలో వృద్ధి చెంది క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. చికిత్స విజయవంతం కావడంతో  యువకుడు కోలుకుంటున్నాడు. త్వరలోనే డిశ్ఛార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను ఎంఎన్‌జేలో ఇప్పటికే పలువురికి ఉచితంగా అందించి ప్రాణాలు నిలిపామని వైద్యులు తెలిపారు. డబ్బులు లేక ఆశలు వదులుకున్న దశలో ఎంఎన్‌జే వైద్యులు ఆదుకున్నారని, వారి మేలు మర్చిపోలేమని హెహనాజ్‌ తల్లిదండ్రులు చెప్పారు. షెహనాజ్‌ ఈ ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి కౌన్సెలింగ్‌ చేస్తూ, వైద్యులను సంప్రదిస్తూ చేయూత అందించిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ (హెచ్‌హెచ్‌ఎఫ్‌).. ఈ యువకుడికి మంగళవారం రూ.50 వేల నగదు సాయం అందించి పెద్ద మనసు చాటుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని