ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచన

సైబర్‌ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది.

Updated : 24 Apr 2024 08:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. నేరాలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్‌ నేరాల తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) ఏర్పాటు చేసింది. ఇందులోని అధికారులు నేరాలు జరుగుతున్న తీరును క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల కొల్లగొట్టిన డబ్బు తిరిగి బాధితుడికి రావడంలేదని గుర్తించారు. అనవసర జాప్యం నివారిస్తే ఫలితం ఉంటుందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు ఆర్బీఐకి సూచించారు. సైబర్‌ నేరాల నియంత్రణకు జాతీయస్థాయిలో సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌, దీనికి అనుబంధంగా 1930 నంబర్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడుండే సిబ్బంది బాధితుడి నుంచి వివరాలన్నీ సేకరించి వాటిని సంబంధిత బ్యాంకుకు అందజేస్తారు. బాధితుడి ఖాతా నుంచి ఏ ఖాతాలో డబ్బు జమైందో బ్యాంకు గుర్తించి సదరు లావాదేవీని వెంటనే నిలిపివేయాల్సి ఉంటుంది. బ్యాంకుల మధ్య సమన్వయం లేకపోవడం, అవగాహనా లోపం వంటి వాటివల్ల త్వరగా స్పందించడంలేదు. ఫిర్యాదు వచ్చిన వెంటనే లావాదేవీ నిలిపివేసేందుకు బ్యాంకులు అవసరమైతే ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆర్బీఐకి సూచించారు. తద్వారా ఏ బ్రాంచి నుంచి డబ్బు పోయింది, ఏ బ్రాంచిలో జమైంది వంటి వివరాలన్నీ క్షణాల్లోనే తెలిసిపోతాయని వారు పేర్కొన్నారు. ప్రతి బ్యాంకు విధిగా పటిష్ఠ సైబర్‌ భద్రతా ప్రమాణాలు పాటించాలని తాము చేసిన సూచనలను అమలు చేసేందుకు ఆర్బీఐ అంగీకరించిందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని