సంక్షిప్త వార్తలు (4)

రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఈసెట్‌)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.

Updated : 25 Apr 2024 06:58 IST

మే చివరి వారానికి టీఎస్‌ఈ సెట్‌ను వాయిదా వేయాలి
సీఎస్‌కు అభ్యర్థుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ఈసెట్‌)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు. బుధవారం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్‌ చివరి పరీక్ష ఏప్రిల్‌ 30న, ఆ తర్వాత ఆరు రోజులకే ఈసెట్‌ పరీక్ష ఉండటంతో తాము పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామన్నారు. కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని కోరారు.


డీసీపీ సాయిచైతన్య బదిలీ

ఈసీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూచన మేరకు హైదరాబాద్‌లోని సౌత్‌జోన్‌ డీసీపీ పి.సాయిచైతన్యను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేశారు. సీఎస్‌ ఆదేశాల మేరకు ఆయన తన కార్యాలయంలో తక్షణమే రిపోర్టు చేయాలని డీజీపీ రవిగుప్తా మరో ఉత్తర్వు జారీ చేశారు. సాయిచైతన్యపై ఇటీవల ఓ పార్టీ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై విచారించిన ఈసీ ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.


మా సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర పెన్షనర్ల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త పీఆర్‌సీలో తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం తెలంగాణ పీఆర్‌సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరింది. సంఘం అధ్యక్షుడు మారం భరత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చోళ ఓం ప్రకాశ్‌ యాదవ్‌, ఇతర నేతలు శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్‌సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. పరిమితి లేకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందించాలని, 65 ఏళ్ల వయస్సులో అదనపు క్వాంటం, వైద్యభత్యం, సీపీఎస్‌ రద్దు, తదితర అంశాలను పీఆర్‌సీలో చేర్చాలని కోరారు.


ఫిట్‌మెంట్‌ 40 శాతం ఉండాలి

పీఆర్‌సీ ఛైర్మన్‌తో రాష్ట్ర పెన్షనర్ల ఐకాస

ఈనాడు, హైదరాబాద్‌: రెండో వేతన సవరణలో ఉద్యోగులు, పెన్షనర్లకు 40 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాలని  పీఆర్‌సీ కమిషన్‌ ఛైర్మన్‌ శివశంకర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దార్ల ఐకాస కోరింది. ఐకాస ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి సుభాకర్‌రావు, ఇతర నేతలు, సూర్యనారాయణ, జ్ఞానేశ్వర్‌, పుల్లయ్య, సత్యనారాయణ, పూర్ణచందర్‌రావు తదితరులు పీఆర్‌సీ ఛైర్మన్‌ను బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి 19 సమస్యల పరిష్కారానికి తమ ప్రతిపాదనలు సమర్పించారు. నగదు రహిత చికిత్సను మెరుగుపరిచి, అన్ని ఆసుపత్రులకు విస్తరించాలని, పెన్షనర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థల విశ్రాంత ఉద్యోగులకూ నగదు రహిత ఆరోగ్య పథకం వర్తింపజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు