ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్‌ ప్రవేశాలు

రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Published : 25 Apr 2024 03:22 IST

కసరత్తు చేస్తున్నామన్న విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
జూన్‌ 2లోపు జరిగే ప్రవేశ పరీక్షల వరకే ఏపీ విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాలని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. జూనియర్‌ కళాశాలలు నిబంధనలను పాటించని పక్షంలో వాటికి జరిమానాలు విధిస్తామన్నారు. బుధవారం ఇంటర్‌ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు: ప్రవేశాల గురించి ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నందున నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోటీసులు ఇవ్వడంతోపాటు జరిమానాలు విధిస్తామన్నారు. దీంతోపాటు ఈ సమస్యను పూర్తిగా నివారించేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానంపై దృష్టి సారించామని తెలిపారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. దోస్త్‌ పథకం ద్వారా అన్ని డిగ్రీ కళాశాలల్లోనూ దీనిని అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు మేరకు ప్రవేశాలు కల్పిస్తున్నామని, నిర్ణీత రుసుములే ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్‌కూ ఈ విధానం అమలుపై ఇప్పటికే సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ద్వారా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. ఒకే ప్రాంగణంలో నాలుగైదు కళాశాలలు నడిపే యాజమాన్యాలపై ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని వివరించారు.


విభజన చట్టం మేరకే...

పీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాల అమలు గడువు వచ్చే జూన్‌ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. అప్పటిలోగా తెలంగాణలో జరిగే ప్రవేశ పరీక్షలు రాసే ఏపీ విద్యార్థులకు ఇక్కడి విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేేశాలు కల్పిస్తామని చెప్పారు. జూన్‌ రెండు తర్వాత తెలంగాణ వారికే స్థానికత వర్తిస్తుందని, ఏపీ విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసినా వారికి ఇక్కడి విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉండవని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని