శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన

‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు.

Published : 25 Apr 2024 03:24 IST

డబ్బులు చెల్లించలేదని ఆవేదన

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: ‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. మరోవైపు వానాకాలం సీజన్‌ ముంచుకొస్తోంది. దుక్కులు సిద్ధం చేసుకొని, ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవడానికి చేతిలో డబ్బుల్లేవు..’ నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో శనగ విత్తన్పోత్పత్తి చేసిన రైతుల దుస్థితి ఇది. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీఎస్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి తరలొచ్చి నిరసన తెలిపారు. తమ డబ్బులు చెల్లించాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

8 వేల క్వింటాళ్ల సేకరణ

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వరి మాదిరే శెనగనూ విత్తనోత్పత్తి చేయిస్తోంది. యాసంగిలో 475 ఎకరాల్లో నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాకు చెందిన రైతులు సాగు చేశారు. సాగు నిబంధనల ప్రకారం ఒప్పంద సేద్యం కావడంతో మార్కెట్‌ ధర కంటే 20 శాతం అదనంగా కట్టిస్తారనే ఆశతో ముందుకొచ్చారు. నెల కిందటే సుమారు 8 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సేకరించి ప్రాసెస్‌ యూనిట్లకు చేర్చారు. ఈ లెక్కన దాదాపు రూ.7 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ధర ఖరారు కాలేదు. కనీసం ముందస్తుగా కొంతైనా చెల్లిస్తారంటే అదీ లేదు. దీంతో బాధిత రైతులు కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మే మొదటి వారంలో రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని టీఎస్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ నిజామాబాద్‌ జిల్లా మేనేజర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని