చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల

వారానికి రెండుసార్లు డయాలసిస్‌.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది.

Updated : 25 Apr 2024 06:48 IST

ఇంటర్‌లో 927 మార్కులతో ప్రతిభ చాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

మార్కండేయకాలనీ(గోదావరిఖని), న్యూస్‌టుడే: వారానికి రెండుసార్లు డయాలసిస్‌.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. బుధవారం వెలువరించిన ఇంటర్‌ ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనారపు సిరి సత్తాచాటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. శారదానగర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివిన సిరి సీఈసీ విభాగంలో 927 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. గోదావరిఖని ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కూనారపు పోశం, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోశం స్థానికంగా సెంట్రింగ్‌ పనులుచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమార్తె సిరి గత ఐదు సంవత్సరాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. రోజురోజుకీ వాటి పనితీరు మందగించింది. ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అప్పటి నుంచి వారానికి రెండుసార్లు రక్తశుద్ధి చేయించుకుంటూ మంచానికే పరిమితమైంది. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారాన్ని సహ విద్యార్థుల ద్వారా ఆమెకు చేరవేస్తూ సెల్‌ఫోన్‌లో సందేహాలను నివృత్తి చేసేవారు. ఆమె పరిస్థితిని చూసి దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లిదండ్రులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. పాఠ్యపుస్తకాలతో కుస్తీపట్టిన సిరి సొంతంగా చదువుకొని పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించింది. కుమార్తె కిడ్నీ మార్పిడి వైద్య చికిత్సకు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని ప్రభుత్వం, దాతలు స్పందించి చేయూత అందించాలని తండ్రి పోశం కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు