కాళేశ్వరంపై కమిషన్‌ విచారణ షురూ

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్‌తో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Published : 25 Apr 2024 05:07 IST

జస్టిస్‌ పీసీ ఘోష్‌తో నీటిపారుదలశాఖ అధికారుల భేటీ
శ్వేతపత్రం, విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ, కాగ్‌ రిపోర్టులు అందజేత
ప్రశాంత్‌ జె పాటిల్‌ నేతృత్వంలో నోడల్‌ టీం  
నేడు అధికారులతో కమిషన్‌ సమావేశం.. శుక్రవారం బ్యారేజీల సందర్శన

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్‌ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్‌తో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాంజ్‌లో జస్టిస్‌ ఘోష్‌ వారితో గంటపాటు సమావేశమయ్యారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపంపై ఆరా తీసినట్లు సమాచారం. విచారణకు అవసరమైన సాంకేతిక సిబ్బంది, వనరులపై తొలిరోజు కమిషన్‌ దృష్టిసారించినట్లు తెలిసింది. గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానుంది. 26న మూడు బ్యారేజీలనూ సందర్శించనుంది.

బీఆర్కే భవన్‌లో కలిసిన ఈఎన్సీ బృందం

నగరంలోని బీఆర్కే భవన్‌లో ఎనిమిదో అంతస్తులో ఏర్పాటు చేసిన కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్న జస్టిస్‌ ఘోష్‌ను నీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌ నేతృత్వంలో ఓఅండ్‌ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ సీఈ ధర్మా తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.

పూర్తి సమాచారం సమర్పణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కమిషన్‌ కోరింది. దీంతో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, మూడు బ్యారేజీలపై విజిలెన్స్‌ విచారణకు సంబంధించిన సమాచారం, జాతీయ డ్యాం భద్రతా సంస్థ(ఎన్డీఎస్‌ఏ) పలు దఫాలుగా నిర్వహించిన విచారణకు సంబంధించి వివరాలు, కాగ్‌ నివేదికలను అధికారులు అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన నివేదికలను కూడా సమర్పించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించి మరింత సమాచారాన్ని గురువారం అందజేయనున్నట్లు తెలిసింది.


తొమ్మిది మందితో కూడిన నోడల్‌ టీం

మిషన్‌ కోరే సమాచారాన్ని అందించేందుకు, ఇతరత్రా సహాయకులుగా ఉండేందుకు బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించడంతో తొమ్మిది మందితో కూడిన నోడల్‌ టీంను నియమిస్తూ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నేతృత్వం వహిస్తారు. నోడల్‌ టీంలో ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, నాగేంద్రరావు, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్‌, ఈఈలు జి.జ్ఞానేశ్వర్‌రెడ్డి, టి.వేణుగోపాల్‌, డీఈఈ వి.వేణు, ఏఈఈలు సదత్‌ షేక్‌, దీక్షిత్‌, బి.గోపి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని