ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుకు ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది.

Published : 25 Apr 2024 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుకు ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు ఎస్కార్ట్‌ బెయిలు ఇవ్వాలని ఆయన తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం న్యాయస్థానం దీనిపై విచారించింది. పోలీసుల తరఫు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బెయిలు పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల హడావుడిలో రాధాకిషన్‌రావుకు భద్రత కల్పించలేమని, ఎల్‌ఎంఎం కోర్సు రెండేళ్లు ఉంటుందని, పరీక్షలు రాసేందుకు తర్వాత వెసులుబాటు ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర బెయిలు ఇవ్వడానికి నిరాకరించింది.

ప్రణీత్‌రావు అదనపు ఎస్పీల బెయిలు పిటిషన్‌పై నేడు తీర్పు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. బుధవారం ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండులో ఉన్న ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు.. తమకు బెయిలు మంజూరు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టగా.. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో నిందితులకు బెయిలు మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఈ కేసులో పెద్దసంఖ్యలో బాధితులుండే అవకాశముందని తెలిపారు. అరెస్టయిన వారి నుంచి ఇప్పటికే సమాచారం సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసు దర్యాప్తులో సేకరించినట్లు చెబుతున్న హార్డ్‌డిస్కుల శకలాలు, ఇతర ఆధారాలను కోర్టుకు ఎందుకు సమర్పించడం లేదన్నారు. సెక్షన్‌ 409, ఐటీ యాక్టు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు గురువారానికి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని