మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి

మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 25 Apr 2024 05:34 IST

మెట్రో ఎండీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌ సమీపంలోని బోయిగూడ మెట్రో పిల్లర్‌ బి1006 వద్ద రైల్వే ట్రాక్‌ వంపు వద్ద మితిమీరిన శబ్దం వస్తోందని, నియంత్రణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్‌ హనుమాన్లు హైకోర్టుకు లేఖ రాశారు. పరిమితికి మించి వస్తున్న రైలు శబ్దంతో వినికిడి సమస్యలతో పాటు రక్తపోటు పెరగడం, గుండెపోటు వంటి జబ్బులకు అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, కాలుష్య నిబంధనల ప్రకారం అధిక శబ్దం హార్మోన్ల సమతౌల్యతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మెట్రో రైల్వే బృందం ఇటీవల బోయిగూడ, జూబ్లీహిల్స్‌ బస్‌స్టేషన్‌, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ల వద్ద మెట్రో రైలు వెళుతున్నపుడు శబ్దాన్ని రికార్డు చేసిందన్నారు. ఎంఎన్‌కె విఠల్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద రైలు వెళుతున్నపుడు ధ్వని తీవ్రత 80 డెసిబుల్స్‌ ఉందన్నారు. మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, నాగ్‌పుర్‌, బెంగళూరు, నోయిడా, కోల్‌కతాల్లో ధ్వని కాలుష్యాన్ని నిరోధించేలా సౌర విద్యుత్తు పలకలను ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు చేసి ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు విద్యుదుత్పత్తి చేపట్టాలన్నారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనరు, సంబంధిత పోలీసు అధికారులు, మెట్రో రైలు ఎండీ, మెట్రోరైల్‌ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని