రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు.

Published : 25 Apr 2024 05:04 IST

తాజాగా గడ్డర్లు కూలడంతో అప్రమత్తం
నిర్మాణంలో 487 వారధులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. గడువు ముగిసినా పూర్తి చేయని నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మానేరు వాగులో చేపట్టిన వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి కూలిపోవటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ వాగులో 2016లో చేపట్టిన వంతెన నిర్మాణం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ‘పిల్లర్లపై నిలిపిన గడ్డర్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. వాటికి ఊతంగా బేరింగ్‌లు అమర్చకుండా కర్రలను మాత్రమే సపోర్టుగా ఏర్పాటు చేశారు. అవి ఎండలకు ఎండి వానలకు తడిసి పుచ్చిపోవటంతో గడ్డర్లు కూలిపోయాయి’ అని ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీరు మోహన్‌ నాయక్‌ తెలిపారు. వాగులో నీటి ప్రవాహం లేకపోవటంతో ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రహదారులు-భవనాల శాఖ రూ.4,862 కోట్ల వ్యయంతో 956 వంతెనలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 469 వంతెనలనే పూర్తి చేయగలిగారు. ఇంకా 487 నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొత్తం వంతెనల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌, నాన్‌ప్లాన్‌ నిధుల నుంచి అత్యధికంగా 743 మంజూరు చేసింది. ఈ రెండు విభాగాల నుంచి రూ.4,105 కోట్లు కేటాయించగా 367 పూర్తయ్యాయి. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 113కి గాను ఇప్పటి వరకు కేవలం 22 నిర్మించారు. తాజా సంఘటనపై ప్రభుత్వం ఆరా తీయటంతో అధికారులు కదిలారు.

నివేదిక కోరిన ప్రభుత్వం!

నిర్మాణంలో ఉన్న వంతెనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. జిల్లాల వారీగా సమాచారం తెప్పించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత వాటిని తనిఖీ చేసే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామని ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. గడువు ముగిసినా పూర్తి కాని నిర్మాణాలను తొలిదశలో తనిఖీలు చేయాలన్నది వ్యూహంగా ఉంది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కూడా నిర్మాణాలు ఆలస్యమవటానికి కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత గుత్తేదారుల పరంగా జాప్యం జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసిన అనంతరం పెండింగులో ఉన్న చెల్లింపులపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని