హైదరాబాద్‌-కొచ్చి విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లడానికి సిద్ధమై రన్‌వేపైకి వచ్చిన ఓ విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండున్నర గంటలు ఆలస్యంగా ఈ విమానం కొచ్చికి బయలుదేరింది.

Published : 15 May 2024 06:02 IST

రెండున్నర గంటలు ఆలస్యంగా టేకాఫ్‌
ప్రయాణికుల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి, ముగ్గురు ఎమ్మెల్యేలు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లడానికి సిద్ధమై రన్‌వేపైకి వచ్చిన ఓ విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండున్నర గంటలు ఆలస్యంగా ఈ విమానం కొచ్చికి బయలుదేరింది. ఈ లోహ విహంగంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ తదితరులున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఉదయం 10 గంటలకు 180 మంది ప్రయాణికులతో కొచ్చి వెళ్లడానికి రన్‌వే పైకి వచ్చింది. టేకాఫ్‌ తీసుకోవడానికి సిద్ధం అవుతున్న తరుణంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలట్‌ వెంటనే ఏటీసీ అధికారులతో మాట్లాడి.. టేకాఫ్‌ నిలిపివేశారు. ఇంజినీరింగ్‌ నిపుణులు రెండు గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. అప్పటివరకు ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఆ విమాన సర్వీస్‌ కొచ్చికి బయల్దేరింది. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు శబరిమల  వెళ్లడానికి విమానంలో కొచ్చి బయలుదేరినట్లు తెలిసింది.

అయ్యప్ప దర్శనానికే వెళ్లా: రోహిత్‌రెడ్డి

తాండూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఇదే విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో భారాస మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘కాంగ్రెస్‌ నాయకులున్న విమానంలోనే నేను కూడా కొచ్చికి బయలుదేరడం కేవలం యాదృచ్ఛికం. వారితో నేనేమీ మాట్లాడలేదు. కేవలం అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవడానికే నేను కొచ్చి వెళ్లాను. కాంగ్రెస్‌లో చేరతానని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నేను ఆ పార్టీలో చేరేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని