అనుబంధ ఒప్పందం చేస్తేనే మేడిగడ్డ మరమ్మతులు!

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతు పనులు చేపట్టేందుకు.. అనుబంధ ఒప్పందం(సప్లిమెంటరీ అగ్రిమెంట్‌) చేసుకుంటేనే ముందుకు వస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పేర్కొన్నట్లు తెలిసింది.

Published : 15 May 2024 06:02 IST

నీటిపారుదల శాఖకు తెలిపిన నిర్మాణ సంస్థ
బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఈఎన్సీ సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతు పనులు చేపట్టేందుకు.. అనుబంధ ఒప్పందం(సప్లిమెంటరీ అగ్రిమెంట్‌) చేసుకుంటేనే ముందుకు వస్తామని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ పేర్కొన్నట్లు తెలిసింది. బ్యారేజీ పునరుద్ధరణపై నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో పలు విభాగాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ డ్యాం సేఫ్టీ సంస్థ(ఎన్డీఎస్‌ఏ) మేడిగడ్డ మరమ్మతులకు అందజేసిన మధ్యంతర నివేదికపై చర్చించారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగాయి. దీంతో బ్యారేజీలో నీటిని దిగువకు వదిలేశారు. కారణాలేమిటనే దానిపై నీటిపారుదల శాఖతో పాటు ఎన్డీఎస్‌ఏ కమిటీ పలుమార్లు అధ్యయనం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందున వరద ముప్పు నుంచి రక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీని కోరింది. న్యాయవిచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీఘోష్‌ కూడా పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్‌ఏ నుంచి మధ్యంతర నివేదిక కోరాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో గత నెలాఖరున కమిటీ ఒక నివేదికను అందజేసింది. దీనిపై మంగళవారం నాటి సమావేశంలో చర్చించారు. నివేదికలో పేర్కొన్న అంశాలు, చేపట్టాల్సిన పనులపై ఈఎన్సీ ఒక ప్రజంటేషన్‌ సమర్పించినట్లు తెలిసింది. దెబ్బతిన్న రెండు క్రెస్ట్‌ గేట్లు తొలగించాలని, ఆప్రాన్‌ వెడల్పు పెంచాలని పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ప్రజంటేషన్‌ ఇచ్చారు. చేయాల్సిన పనులు, అంచనా వ్యయాలకు సంబంధించి వివరాలు అందజేసినట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశంలో కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్‌ విభాగం కూడా పలు సూచనలు ఇచ్చినట్లు తెలియవచ్చింది. క్రెస్ట్‌ గేట్లు తెరిచి ఉంచేలా బ్యారేజీ డిజైన్‌ చేస్తే మూసివేసి నీటిని నిల్వ చేస్తున్నారని పేర్కొన్నట్లు తెలియవచ్చింది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్రరావు, సీడీవో సీఈ మోహన్‌కుమార్‌, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల సలహాదారుగా ఎన్‌.రంగారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టుల సలహాదారుగా విశ్రాంత ఎస్‌ఈ ఎన్‌.రంగారెడ్డిని ప్రభుత్వం నియమించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా కొత్తగా కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌.రంగారెడ్డి నియామకం చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు నీటిపారుదలశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని